రవితేజకు మాస్ రాజా అని పేరు ఊరికే రాలేదు. హీరోగా ఆయన ఎక్కువ సినిమాలు చేసింది, ఎక్కువ విజయాలు అందుకుంది మాస్ చిత్రాలతోనే. ఐతే ఎప్పుడూ అవే సినిమాలు చేస్తే బాగుండదని.. ఆయన అప్పుడప్పుడూ భిన్నమైన, క్లాస్ టచ్ ఉన్న సినిమాలూ ట్రై చేస్తుంటారు. కానీ వాటిలో వర్కవుట్ అయినవి చాలా తక్కువ. దీంతో మళ్లీ మాస్ చిత్రాలకే ఓటు వేస్తుంటారు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే తన మార్కు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మాస్ రాజా ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. ఐతే రవితేజ ఈసారి ఓ క్లాస్ దర్శకుడిగా జట్టు కట్టబోతున్నట్లు సమాచారం.
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి లాంటి సినిమాలతో సత్తా చాటిన కిషోర్ తిరుమలతో మాస్ రాజా ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం వీరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం. చిత్రలహరి తర్వాత కిషోర్ తిరుమలకు సక్సెస్ లేదు. రెడ్ మూవీతో పాటు ఆడవాళ్లూ మీకు జోహార్లు నిరాశపరిచాయి. ముఖ్యంగా శర్వానంద్‌తో చేసిన ఆడవాళ్లూ మీకు జోహార్లు పూర్తిగా నిరాశరిచింది. దీంతో ఆయన కెరీర్లో గ్యాప్ వచ్చింది. మూడేళ్ల పాటు మరో సినిమా చేయలేదు. ఎట్టకేలకు కిషోర్ ప్రయత్నం ఫలించి సినిమా పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
మధ్యలో కిషోర్ అనార్కలీ అనే కథను రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ దానికి హీరో సెట్ కాలేదు. మరి ఆ కథనే మాస్ రాజాతో చేయబోతున్నాడా.. లేక ఇంకోటా అన్నది క్లారిటీ లేదు. రవితేజతో సినిమా అంటే కిషోర్ తరహాలో పూర్తి క్లాస్‌గా తీస్తే మాత్రం కష్టం. కొంచెం క్లాస్ టచ్ ఉన్నప్పటికీ.. మాస్ అంశాలూ పుష్కలంగా ఉండాల్సిందే. మరి కిషోర్.. రవితేజ కోసం ఎలాంటి స్క్రిప్టు రెడీ చేశాడో చూడాలి మరి. రవితేజ దగ్గర ఇంకో ఇద్దరు దర్శకుల కథలు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఐతే కిషోర్ సినిమానే ముందు పట్టాలెక్కించే అవకాశముంది.