ఛావాకు 1000 కోట్లు సాధ్యమేనా

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఛావా మూడో వారంలోనే 555 కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. నిన్న టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. కేవలం ఇండియా వసూళ్లను చూసుకున్నా 484 కోట్లు రావడమంటే మాటలు కాదు. మరాఠా వీరుడి గాథను జనాలు రిసీవ్ చేసుకున్న తీరు ట్రేడ్ వర్గాలకు నోటమాట రాకుండా చేస్తున్నాయి. ఈ దూకుడు ఇంకెంత కాలం ఉంటుందనేది ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. ఏ సినిమాకైనా మైల్ స్టోన్ గా చెప్పుకునే వెయ్యి కోట్ల మార్కును అందుకుంటుందా లేదానేదే అసలు సవాల్. తెలుగు వెర్షన్ ఏడో తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇదో డిబేటబుల్ టాపిక్.

ప్రాక్టికల్ గా చూసుకుంటే ఛావా థౌసండ్ క్రోర్ అందుకోవడం సులభమైతే కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంత బలమైన రన్ తో ఛావా సాధించింది అర సహస్రమే. ఇంకా సగానికి పైగా బాలన్స్ ఉంది. ఆల్రెడీ థియేటర్ రన్ నెమ్మదించింది. బుక్ మై షోలో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తోంది కానీ బిసి సెంటర్స్ లో తగ్గుదల ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. పైగా హెచ్డి పైరసీ బెడద ఒకటి. అందులోనూ కంటెంట్ పరంగా ఇది ఒక కులం, ప్రత్యేకించి మహారాష్ట్రకు సంబంధించినది కావడంతో కొన్ని వర్గాలు ఛావాకు దూరంగా ఉన్నాయి. లేదంటే జవాన్, స్త్రీ 2 లాగా కలెక్షన్లు మరింత వేగంగా దూసుకెళ్ళేవి.

సో ఏ కోణంలో విశ్లేషించినా ఛావా వెయ్యి కోట్లు అందుకోవడం కష్టమే. ఒకవేళ సాధిస్తే అద్భుతమని చెప్పొచ్చు. చైనా, జపాన్ లాంటి దేశాల్లో భవిష్యత్తులో విడుదల చేసినా అక్కడి జనాలకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చెప్పడం కష్టమే. ఓటిటి రిలీజ్ యాభై రోజుల తర్వాతే ఉంటుంది కాబట్టి ఛావాకు థియేటర్ రన్ అంత సులభంగా కిల్ అయిపోదు. ముఖ్యంగా వీకెండ్స్ అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఆలస్యమైనా సరే ఛావా తెలుగులోనూ వండర్స్ చేస్తుందని పంపిణీ బాధ్యతలు తీసుకున్న అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఆలా ఏమైనా జరిగి ఇంకో యాభై కోట్లు తోడైనా మంచిదే.