టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఊపు మామూలుగా లేదిప్పుడు. ఓవైపు వరుసగా అతడి ఆడియోలు మోతెక్కించేస్తున్నాయి. మరోవైపు వరుసగా పెద్ద పెద్ద సినిమాలు అతడి తలుపు తడుతున్నాయి. తెలుగులో ఏ టెక్నీషియన్ అయినా కచ్చితంగా ఒక్క సినిమా అయినా చేయాలనుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. ఆయనతో సినిమా చేయాలన్న తమన్ కోరిక ఇన్నేళ్లకు ‘వకీల్ సాబ్’తో నెరవేర్చుకున్నాడు. దానికే అతను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతుంటే.. మళ్లీ పవన్ సినిమా ఇంకోటి పట్టేశాడతను.
దసరా సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్‌నే ఎంచుకున్నారు. ఈ రోజు అనౌన్స్‌మెంట్ వీడియోలో తమన్ పేరు కూడా కనిపించింది. ఇలా వరుసగా పవన్ సినిమాలు రెండింటికి సంగీతం అందించడం అంటే అరుదైన అవకాశమే. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాకు దేవిశ్రీ సంగీతాన్నందిస్తుండగా.. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమాకు కీరవాణి బాధ్యత తీసుకున్నాడు.
మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాకు కూడా తమనే సంగీత దర్శకుడిగా మారితే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సురేందర్‌తో తమన్‌కు మంచి అనుబంధం ఉంది. అతడితో కిక్, రేసుగుర్రం లాంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లిచ్చాడతను. ఇంకోవైపు తమన్.. మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’కు కూడా సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఇంకో అరడజను దాకా పేరున్న సినిమాలు తమన్ ఖాతాలో ఉండటం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates