మూడేళ్ళ క్రితం లవ్ టుడే హిట్టయినప్పుడు హీరో ప్రదీప్ రంగనాథన్ కు ఏదో గాలివాటం సక్సెస్ దొరికిందని భావించిన వాళ్ళే ఎక్కువ. తాజాగా రిటర్న్ అఫ్ ది డ్రాగన్ సైతం అదే దారిలో వెళ్లడంతో ఇప్పుడీ కుర్రాడి వెనుక అగ్ర నిర్మాణ సంస్థలు నిలబడుతున్నాయి. ముందు ప్రదీప్ పక్కన జోడిగా నటించడానికి వెనుకాడిన క్రేజీ హీరోయిన్లు ఇక ఆలోచించకుండా ఎస్ చెప్పేలా ఉన్నారు. నిర్మాణంలో ఉన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ ఫాంటసీ డ్రామాలో ఎస్జె సూర్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ని పరిచయం చేసే సినిమాలో ప్రదీప్ రంగనాథనే హీరో. ఈ కారణంగానే డ్రాగన్ తెలుగు వెర్షన్ ని ఈ సంస్థ పంపిణి చేసింది. దీంట్లో తనకు జోడిగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు దాదాపు లాకైనట్టు సమాచారం. కీలక భాగం షూటింగ్ ఆల్రెడీ అయిపోయినట్టు వినికిడి. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు కానీ త్వరలోనే లాక్ చేసి తెలుగు తమిళ భాషలకు ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఓకే చేయాల్సిన లిస్టులో మూడు నాలుగు సినిమాలున్నాయట. స్వతహాగా దర్శకుడైన ప్రదీప్ కు ప్రస్తుతం డైరెక్షన్ చేద్దామన్నా యాక్టింగ్ దెబ్బకు ఖాళీ దొరికేలా లేదు.
అంతే మరి, దశ తిరిగితే ఇలాగే ఉంటుంది. అన్నట్టు ఏపీ తెలంగాణలో రిటర్న్ అఫ్ ది డ్రాగన్ డీసెంట్ వసూళ్లతో బాగానే వెళ్తోంది. పోటీలో ఉన్న వాటి కంటే మెరుగైన ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. రికార్డులు బద్దలు కొట్టేంత కాదు కానీ ఏ సెంటర్ ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయస్ ఇదే అవుతోంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రదీప్ క్రమంగా జూనియర్ ధనుష్ గా రూపాంతరం చెందుతున్నాడు. సగటు మధ్య తరగతి కుర్రాడిలా కనిపించే ఈ యూత్ హీరో టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేసే సూచనలు లేకపోలేదు. ఇంకో ఏడాది లేదా రెండేళ్లలో ఆ ముచ్చట కూడా తీరేలా ఉంది. తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట.