కల్ట్ దర్శకుడి మాటలు నమ్మొచ్చా

ఒక స్టార్ హీరో సినిమా ఏడేళ్లు ల్యాబ్ లో మగ్గి రిలీజ్ కోసం అష్టకష్టాలు పడటం అరుదు. కానీ 2017 నుంచి ధృవ నచ్చత్తిరమ్ ఈ పాట్లు పడుతూనే ఉంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలోనే విడుదలవుతుందని, సంక్రాంతికి రిలీజై సెన్సేషనల్ హిట్టు కొట్టిన మదగజరాజా తరహాలో తాము కూడా విజయం సాధించడం ఖాయమని ఇటీవలే పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మే 1 రావొచ్చని లీక్ ఇచ్చారు. అయితే నిజంగా వస్తుందా అంటే ఎవరూ నమ్మడం లేదు. నేరుగా జోక్ చేయకండి గౌతమ్ గారూ అంటూ కామెడీ చేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.

విక్రమ్ ఈ సినిమాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడు. కనీసం ఎక్కడైనా బయట మీడియాకు కనిపించినప్పుడు ప్రస్తావించే చొరవ తీసుకోవడం లేదు. గౌతమ్ మీనన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ధృవ నచ్చత్తిరమ్ చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు నానా యాతన పడుతున్నారు. నటనకు ప్రాధాన్యం ఇస్తూ వీలైనంత ఎక్కువ పాత్రలు చేస్తూ డబ్బును పోగేసే పనిలో పడ్డారు. ఆయన కోరికకు తగ్గట్టు బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. కానీ ధృవ నచ్చత్తిరమ్ బయటికి రావడం మాత్రం అంతకంతా దుర్లభంగా మారిపోయింది. ట్విస్ట్ ఏంటంటే ఇది రెండు భాగాల మూవీ.

పెళ్లి చూపులు, మజాకా ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. దేశ విదేశాలలో చిత్రీకరణ జరిపారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం విక్రమ్ చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే గౌతమ్ మీనన్ ధృవ నచ్చత్తిరమ్ ని మే 1 తీసుకొచ్చేందుకు ట్రై చేయడం బాగానే ఉంది. కానీ అదే రోజు సూర్య రెట్రో, నాని హిట్ 3 ది థర్డ్ కేస్ ఉన్నాయి. వీటితో పోటీ పడటం విక్రమ్ కు అంత సులభంగా ఉండదు. పైగా డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒప్పుకోరు. మరి ఇదంతా ఊరికే కంటితుడుపుగా చెబుతున్నారో లేక నిజంగా మోక్షం కలిగిస్తారో ఎప్పటిలాగే ఎదురు చూడాలి.