బ్రహ్మాజీ కష్టానికి దక్కని ఫలితం

బ్రహ్మాజీ అంతా తానై ప్రమోషన్లు చేసుకున్న బాపూ మొన్న శుక్రవారం విడుదలై కనీస స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక ఎదురీదుతోంది. బలగం లాగే తండ్రి సెంటిమెంట్, తెలంగాణ నేపథ్యం దట్టించినా లాభం లేకపోయింది. అప్పుల పాలైన రైతు కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోతే భీమా డబ్బులు వస్తాయనే ఆశ చుట్టూ నడిపించిన డ్రామా ఆడియన్స్ ని మెప్పించలేకపోతోంది. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా ఇలాంటి సినిమాల్లో కథా బలం, సరైన కథనాలు ఉంటే మెల్లగా అయినా సరే జనం థియేటర్లకు వచ్చి చూస్తారు. కానీ బాపులో అలాంటి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ లేకపోవడం ప్రధాన లోపం.

సీనియర్ మోస్ట్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీ తన పలుకుబడిని వాడి ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులను చాలానే తీసుకొచ్చాడు. వాళ్ళందరూ అభిమానంతో వచ్చి నాలుగు మంచి మాటలు మాట్లాడి వెళ్లారు. బజ్ లేకపోయినా ఈ పబ్లిసిటీ అంతో ఇంతో ఉపయోగపడింది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసి పాజిటివ్ రెస్పాన్స్ చూపించుకున్నారు. ఇంతా చేసి బాపుకి వీకెండ్ లో కూడా కనీస వసూళ్లు దక్కలేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ కాగా కొన్ని సెంటర్లు పది పదిహేను మంది వచ్చిన థియేటర్లలో ఆడించారు. ఇక ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు.

ఫిలిం మేకర్స్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఎమోషన్, సెంటిమెంట్ మీద ఎల్లవేళలా థియేటర్ జనాలను రప్పించలేం. డబ్బులిచ్చి కన్నీళ్లు పెట్టుకునేందుకు ఆడియన్స్ ఇష్టపడరు. అలా జరగాలంటే బ్రహ్మాండమైన టాక్ రావాలి. కానీ బాపూ లాంటి వాటికి అంత సులభం కాదు. అంతో ఇంతో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే కొంత బజ్ వచ్చేది కానీ అది లేకపోవడం వల్ల కనీస స్థాయిలో అంచనాలు రేగలేదు. ఇంకో కోణంలో ఇలాంటి ఫాదర్ సెంటిమెంట్ తోనే వచ్చిన మరో సినిమా రామం రాఘవం సైత నిరాశజనకమైన ఫలితమే అందుకుంది. డబ్బింగ్ సినిమా డ్రాగన్ డామినేషన్ కూడా స్ట్రెయిట్ చిత్రాల దెబ్బకు ఒక కారణం.