త్రివిక్రమ్ తక్షణ కర్తవ్యం ఏమిటో

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయేది దర్శకుడు అట్లీతో అన్నది దాదాపు ఖరారైపోయింది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు తెరవెనుక జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఉండొచ్చనేది లేటెస్ట్ అప్డేట్. అయితే దీనికన్నా ముందు ఫిక్స్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాంటసీ మూవీ సంగతేంటనేది మాత్రం బయటికి రావడం లేదు. స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కోసం ఇంకాస్త టైం అవసరం కావడం వల్లే అట్లీని ముందుకు తెచ్చారనేది ఒక వెర్షన్. సల్మాన్ ఖాన్ సినిమాకు క్యాస్టింగ్ కుదరలేదు కనకే అట్లీ ఇటు వచ్చాడనేది బాలీవుడ్ కథనం.

వీటి సంగతి ఎలా ఉన్నా త్రివిక్రమ్ ప్రస్తుతం రెండు ఆప్షన్లు చూస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. ఒకటి బన్నీ కథ మీద ఇంకాస్త సీరియస్ గా వర్క్ చేసి బెస్ట్ వెర్షన్ సిద్ధం చేసుకోవడం. లేదా చేతిలో ఉన్న కథల్లో బెస్ట్ అనిపించే ఒకదానితో మరో సినిమా పూర్తి చేసుకుని రావడం. ఎనర్జిజిటిక్ రామ్ తో త్రివిక్రమ్ కాంబోని సెట్ చేయాలని స్రవంతి రవికిశోర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి నెరవేరొచ్చని అంటున్నారు. కాకపోతే ఆయన ప్రొడక్షన్ కాకుండా సితారలో అయినా ఓకే అని చెప్పారని టాక్. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఒప్పందం ఇప్పటిదాకా జరగలేదు. కేవలం ప్రతిపాదన మాత్రమే.

అల వైకుంఠపురములో వచ్చి అయిదేళ్ళు అయిపోయింది. గుంటూరు కారం పూర్తి అంచనాలు అందుకోలేదు కాబట్టే త్రివిక్రమ్ దాని పోస్ట్ ప్రమోషన్లలో కనిపించలేదు. సాలిడ్ కంబ్యాక్ ఇప్పుడు చాలా అవసరం. రామ్ టయర్ 1 స్టార్ కాదు కాబట్టి నిజంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లోనే అనుమానాలున్నాయి. మరి బన్నీ అట్లీ సినిమా వేగంగా తీసినా సరే రిలీజ్ నాటికి ఎంత లేదన్నా ఏడాది సమయం పడుతుంది. మరి అప్పటిదాకా త్రివిక్రమ్ వేచి చూస్తారా అనేది భేతాళ ప్రశ్న. క్లారిటీ రావాలంటే త్రివిక్రమ్ లేదా అల్లు అర్జున్ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మీడియా ముందుకు రావాలి. ఇప్పట్లో జరిగేనా.