మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి కొణిదల అంజనాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆమె ఆసుపత్రిలో ఉన్నారని.. సోషల్ మీడియాలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక, అదిగో పులి.. అంటే ఇదిగో తోక అనే టైపులో.. చిన్నపాటి సైట్లు, ఇతర వ్యక్తిగత మాధ్యమాల్లో అయితే.. దీనికి మరింత మసాలా జోడించి.. బాత్రూంలో అంజనాదేవి కాలుజారి పడ్డారని.. ఆమె ఆసుపత్రిలో కోలుకోలేని స్థితిలో ఉన్నారని కూడా వ్యాఖ్యలు చేస్తూ.. ప్రచారాన్ని జోరెత్తించారు. దీనిపై నిజానిజాలు తెలుసుకోకుండానే కొందరు కామెంట్లు కుమ్మరించారు.
ఈ పరిణామాలు..సినీ రంగాన్నే కాకుండా.. ఇటు సాధారణ ప్రజలను, మెగా అభిమానులను కూడా కలచి వేశాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి మెగా స్టార్ చిరంజీవి నివాసం వద్దవేచి ఉన్న అభిమానులకు కూడా లెక్కలేకుండా పోయింది. అంజనా దేవి ఆరోగ్యంపై నిమిషానికోరకంగా.. వచ్చిన వార్తలుసోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో నేరుగా మెగాస్టార్ స్పందించారు. “మా అమ్మ బాగుంది“ అని చల్లని కబురు అందించారు. అంతేకాదు.. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు ఏమీ కాలేదు. స్వల్ప అస్వస్థతతో రెండు రోజుల నుంచి కొంత ఇబ్బంది పడుతున్నారు. అని పేర్కొన్నారు.
అంజనాదేవికి ఏదో జరిగిపోయిందంటూ.. వస్తున్న వార్తలను ఎవరూ విశ్వసించవద్దని చిరు అభ్యర్థించారు. ప్రధాన మీడియా సహా.. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వస్తున్నవార్తలను ఖండించిన ఆయన.. ఇలాంటి ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సహృదయంతో మీడియా అర్ధం చేసుకుంటుందని ఆశిస్తున్నట్టు చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో చిరు పోస్టు చేశారు. కాగా.. గతంలోనూ అనేక మంది నటుల కుటుంబాలపై కూడా ఇలానే ప్రచారం జరిగింది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన వారు కూడా ఖండించడం తెలిసిందే.