భయంకరావతారంలో కాజల్

కాజల్ అగర్వాల్ చడీచప్పుడు లేకుండా ఒక షాకిచ్చేసింది. ఆమె డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయింది. కాజల్ ప్రధాన పాత్రలో ‘లైవ్ టెలికాస్ట్’ పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కుతుండటం విశేషం. హాట్ స్టార్ కోసం ఈ సిరీస్ రూపొందుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు.

కాజల్‌తో పాటు వెంకట్ ప్రభు ఫేవరెట్ నటుల్లో ఒకడైన తెలుగు కుర్రాడు వైభవ్, తెలుగమ్మాయే అయినా తమిళంలో మంచి పేరు సంపాదించిన ఆనంది మిగతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇదొక హార్రర్ సిరీస్ అని దీని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. కాజల్ దయ్యం కళ్లతో భయంకరంగా కనిపిస్తోంది. వైభవ్, ఆనంది భయంతో చూస్తున్నట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు.

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే ఇది ‘13 బి’ తరహా టీవీ హార్రర్ నేపథ్యంలో సాగే సినిమానేమో అనిపిస్తోంది. ఇంతకుముందు వెంకట్ ప్రభు సూర్య హీరోగా ‘రాక్షసుడు’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అది హార్రర్ కామెడీ నేపథ్యంలో సాగిన సినిమా. భయం పుట్టించడంలో, నవ్వించడంలో అందులో వెంకట్ బాగానే విజయవంతం అయ్యాడు. ఇప్పుడూ పూర్తిగా భయపెట్టడానికే సిద్ధమైనట్లున్నాడు.

కాజల్‌ను వెబ్ సిరీస్‌ల్లో నటింపజేయడానికి గత ఏడాది నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఓ పేరున్న దర్శకుడు, పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లకు ఆమె ఓకే చెప్పింది. ఈ నెలాఖర్లో పెళ్లి చేసుకోబోతున్న కాజల్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొంత కాలం కొనసాగనున్నట్లు సంకేతాలిచ్చింది. వాటితో పాటుగా ఈ వెబ్ సిరీస్‌ను కూడా చేస్తుందన్నమాట. మున్ముందు మరిన్ని వెబ్ సిరీస్‌ల్లో ఆమె నటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేం.