‘తెలుగు హీరోయిన్’ చర్చపై SKN రియాక్షన్…

ఇటీవల ‘డ్రాగన్’ అనే తమిళ అనువాద చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్లో పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు వాళ్లకు తెలుగు రాని హీరోయిన్లంటే ఇష్టమని పేర్కొన్న ఎస్కేఎన్.. తెలుగు మాట్లాడే హీరోయిన్లను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో తనకు ఈ మధ్యే అర్థం అయిందని.. అందుకే ఇకపై తాను, దర్శకుడు సాయి రాజేష్ తెలుగు రాని వాళ్లను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నామని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ గత రెండు రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్య.. ‘బేబి’ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేసిందే అనే చర్చ జరిగింది. ఐతే తన వ్యాఖ్యలపై ఈ రోజు ఎస్కేఎన్ వివరణ ఇచ్చాడు. తాను తెలుగు అమ్మాయిలకు వ్యతిరేకం కాదని చెబుతూ తన ట్రాక్ రికార్డును వివరించే ప్రయత్నం చేశాడు ఎస్కేఎన్.

తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను పరిచయం చేసిన అతి తక్కువ మంది నిర్మాతల్లో తాను ఒకడినని చెబుతూ.. రేష్మ, ఆనంది, వైష్ణవి చైతన్య, మానస, ప్రియాంక జవాల్కర్, ఖుషిత.. ఇలా తాను పరిచయం చేసిన తెలుగు హీరోయిన్ల పేర్లను ప్రస్తావించారు. తన సినిమాల్లో హీరోయిన్లుగానే కాక టెక్నీషియన్లు, రైటర్లుగా కూడా తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇచ్చే ప్రయత్నం జరిగిందని.. ఇక ముందు కూడా అది కొనసాగుతుందని.. కనీసం 25 మంది తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని తాను నిర్మాతగా మారినట్లు ఎస్కేఎన్ వివరించాడు.

తాను ‘డ్రాగన్’ ఈవెంట్లో సరదాగానే కామెంట్స్ చేశానని.. కానీ తాను తెలుగమ్మాయిలకు వ్యతిరేకం అన్నట్లు, ఇకపై తెలుగు హీరోయిన్లతో పని చేయను అన్నట్లు దాన్ని ప్రచారం చేస్తున్నారని.. అది కరెక్ట్ కాదని ఎస్కేఎన్ స్పష్టం చేశాడు. ఐతే ఈ మేరకు క్లారిటీ ఇవ్వడం బాగానే ఉంది కానీ.. అసలు తన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నది మాత్రం ఎస్కేఎన్ చెప్పలేదు. కాకపోతే తాను అవకాశం ఇచ్చిన అమ్మాయిల పేర్లలో వైష్ణవి చైతన్య పేరు మాత్రం ప్రస్తావించాడు. వైష్ణవిని ఉద్దేశించి తానా కామెంట్ చేయలేదని కూడా ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటే.. నెటిజన్లు ఆమెను టార్గెట్ చేయడం ఆపేసి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసేవారేమో.