విచిత్రమైన వివాదంలో ఏఆర్ రెహమాన్

తమిళ లెజెండరీ మ్యుజీషియన్ ఏఆర్ రెహమాన్‌.. బాలీవుడ్లోనూ ఎన్నో భారీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఒక దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు రెహమాన్. హిందీలో ‘తాళ్’ మొదలుకుని ఎన్నో అద్భుతాలు చేశాడు. బాలీవుడ్లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్నా, దర్శక నిర్మాతలు రెహమాన్ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు. ఐతే గత దశాబ్ద కాలంలో రెహమాన్ జోరు బాగా తగ్గింది. ఆయన తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వట్లేదని అభిమానులు కూడా ఫీలవుతున్నారు.

ఇలాంటి టైంలో ‘చావా’ లాంటి భారీ చిత్రానికి రెహమాన్ మ్యూజిక్ చేశాడు. గత శుక్రవారమే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి అన్ని అంశాల మీదా ప్రశంసలు కురుస్తున్నాయి కానీ.. రెహమాన్ సంగీతం గురించి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.

‘చావా’ సినిమాకు తెర మీద అక్షయ్ ఖన్నా విలన్ అయితే.. తెర వెనుక మాత్రం రెహమానే పెద్ద విలన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు రెహమాన్ సరైన పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వలేదని నెటిజన్లు చాలామంది మండి పడుతున్నారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చారిత్ర నేపథ్యం ఉన్న సినిమాలకు సరిపడే సౌండ్ ఇవ్వకుండా.. మోడర్న్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాటి సన్నివేశాల బలాన్ని తగ్గించాడని రెహమాన్‌ను విమర్శిస్తున్నారు.

కొందరు ఒక అడుగు ముందుకు వేసి.. దీనికి మతం రంగు కూడా జోడిస్తున్నారు. ఇది ముస్లిం రాజులను చెడుగా చూపిస్తూ, హిందూ సంస్కృతిని హైలైట్ చేసిన సినిమా కావడంతో రెహమాన్‌కు అది రుచించక.. సినిమాకు మొక్కుబడిగా, బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాడని.. ఈ చిత్రానికి రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకోవడమే టీం చేసిన తప్పు అని కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అజయ్-అతుల్‌కు సంగీత బాధ్యతలు అప్పగిస్తే పర్ఫెక్ట్‌గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ రెహమాన్ మద్దతుదారులు మాత్రం ఆయన పక్కా ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని వాదిస్తున్నారు.