వంగా.. రెండు మూడు కథలు రాసేయవా ప్లీజ్

కరోనా బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం కొంచెం లేటుగానే చేశాడు విజయ్ దేవరకొండ. నెల రోజుల పాటు ఏమీ మాట్లాడుకుండా సైలెంటుగా ఉన్న అతను.. ఓ భారీ ప్రణాళికతో రెండు రోజుల కిందట మీడియాను పలకరించాడు. రెండు ట్రస్టుల్లాంటివి ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాల కల్పన, బాధితులకు నిత్యావసరాల అందజేత కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఇందుకోసం కోటి 30 లక్షల ఫండ్ కూడా ఏర్పాటు చేశాడు.

దీనిపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజయ్‌కు ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి కూడా దీనిపై స్పందించాడు. విజయ్‌ను పొగిడే క్రమంలో ఆయన కెమిస్ట్రీ పాఠాల్లోకి వెళ్లిపోయాడు. ఇనుము, స్టీల్, కంచు, టైటానియం లాంటి లోహాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిపితే ఎనలేని శక్తి వస్తుందని.. అవి అన్ని రకాల ఉపద్రవాలు, కెమికల్ రియాక్షన్లను తట్టుకుంటాయని.. విజయ్ కరోనా బాధితుల్ని ఆదుకునే క్రమంలో ఇలాంటి మిశ్రమంతోనే వచ్చాడని కొనియాడాడు.

ఈ కామెంట్ మీద ఏమీ బదులివ్వని విజయ్.. తాను సందీప్‌ను బాగా మిస్సవుతున్నట్లు మాత్రం చెప్పాడు. లాక్ డౌన్ టైంలో రెండు మూడు స్క్రిప్టులు రెడీ చేయమని సందీప్‌ను కోరిన విజయ్.. షూట్ కోసం రెండేళ్లు ఎదురు చూడలేనని అన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్, సందీప్ కలయికలో రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన సందీప్ దీని రీమేక్‌తో అక్కడా సెన్సేషనల్ హిట్ కొట్టాడు.

తన మూడో సినిమాను కూడా అక్కడే చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అతను టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తే అది విజయ్ సినిమాతోనే కావచ్చని అంటున్నారు. ఐతే ఆ సినిమా తెరకెక్కడానికి రెండేళ్లు పట్టేలా ఉండటంతో అంత వరకు ఆగలేనని.. లాక్ డౌన్ టైంలో కథ రెడీ చేసుకుంటే.. సాధ్యమైనంత త్వరగా జట్టు కడదామని సందీప్‌కు విజయ్ సంకేతాలిస్తున్నట్లుంది.