మంచి బేనర్ పై చెరగని మరక పడినట్టయ్యింది…

షైన్ స్క్రీన్స్.. టాలీవుడ్లో ప్రస్తుతం చాలా యాక్టివ్‌గా ఉన్న బేనర్లలో ఒకటి. హరీష్ పెద్దితో కలిసి సాహు గారపాటి ఈ సంస్థను మొదలుపెట్టాడు. ప్రస్తుతం సాహు ఒక్కడే దీన్ని నడిపిస్తున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంతో షైన్ స్క్రీన్స్ ప్రయాణం మొదలైంది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. రెండో చిత్రం ‘మజిలీ’ పెద్ద హిట్టయి ఈ సంస్థను నిలబెట్టింది.

ఆ తర్వాత గాలి సంపత్, ఉగ్రం కొంత నిరాశపరిచాయి. ఓటీటీలో నేరుగా రిలీజైన ‘టక్ జగదీష్’ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. నిర్మాతలకు లాభాలే అందించింది. ఇక నందమూరి బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ షైన్ స్క్రీన్ సంస్థలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సంస్త స్థాయిని పెంచింది. ఈ చిత్రాన్ని రూపొందించిన అనిల్ రావిపూడితోనే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా నిర్మించబోతోంది షైన్ స్క్రీన్స్ సంస్థ.

ఐతే ఈ ప్రాజెక్టు గురించి ఎగ్జైట్ అవుతున్న దశలో సాహు గారపాటికి పెద్ద షాక్ తగిలింది ‘లైలా2 సినిమా రూపంలో. షైన్ స్క్రీన్స్ సంస్థలో ఇప్పటిదాకా వచ్చిన చిత్రాల్లో కొన్ని ఫ్లాపులు ఉండొచ్చు. కానీ వాటిని దారుణమైన సినిమాలని చెప్పలేం. గాలి సంపత్, ఉగ్రం లాంటి చిత్రాలు మంచి కంటెంట్‌తో తెరకెక్కాయి. ‘కృష్ణార్జున యుద్ధం’ను బ్యాడ్ మూవీగా చెప్పలేం. ఫ్లాప్ సినిమాలతోనూ గౌరవమే సంపాదించుకుందీ సంస్థ.

అలాంటి బేనర్ మీద ‘లైలా’ రూపంలో పెద్ద మరక పడింది. ఈ సినిమా డిజాస్టర్ కావడం ఒకెత్తయితే.. చూసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా విమర్శిస్తుండడం మరో ఎత్తు. యూత్ సినిమా పేరుతో దారుణమైన బూతు సీన్లు, డైలాగులతో సినిమాను తీర్చిదిద్దిన తీరును అందరూ తప్పుబడుతున్నారు. సినిమా ఎలా తీయకూడదో చెప్పడానికి దీన్ని ఉదాహరణగా దీన్ని చూపిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఇంత ఏకగ్రీవంగా అందరూ వ్యతిరేకించిన సినిమా ఇదే. ఇందులోని సీన్లు, డైలాగుల గురించి మాట్లాడ్డానికి కూడా జనం ఇబ్బంది పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సినిమా తీసి డబ్బులు పోగొట్టుకోవడానికి తోడు.. ఇలా అవమాన భారాన్ని ఎదుర్కోవాల్సి రావడం నిర్మాతకు ఎంత ఇబ్బందో చెప్పేదేముంది?