తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ స్థానమేంటో, ఆయన స్థాయేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్నటి ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దాని దర్శకుడు మాట్లాడుతూ.. తెలుగు సినిమా స్థాయినే పెంచిన హీరో అంటూ చిరు గురించి ఇచ్చిన ఎలివేషన్లో అతిశయోక్తి ఏమీ లేదు. ఇదే వేడుకలో చిరు గొప్పదనం గురించి లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం సైతం గొప్పగా మాట్లాడాడు.
ఐతే ఆ స్థాయి వ్యక్తి అదే ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. చిరు యథాలాపంగా చేసిన కామెంట్స్ ఆయన స్థాయిని తగ్గించేలా కనిపిస్తున్నాయి. తన ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువైపోయారని.. తన పని ఉమెన్స్ హాస్టల్లో వార్డెన్‌లా తయారైందని నవ్వుతూ వ్యాఖ్యానించాడు చిరు. అంత వరకు ఓకే కానీ.. చరణ్ ఎక్కడ ఆడపిల్లని కంటాడో అని భయపడ్డానని.. మన వారసత్వాన్ని కొనసాగించడానికి మగబిడ్డను కనమని అన్నానని చిరు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఆడపిల్లిల్ని తక్కువ చేసే ఉద్దేశం చిరుకు లేకపోవచ్చు. ఆయన అలా చూస్తారని కూడా ఎవ్వరూ అనుకోరు. కానీ పబ్లిక్‌లో ఉన్నపుడు చిరు స్థాయి వ్యక్తులు చేసే కామెంట్లు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తాయన్నది ఆలోచించాలి. మగపిల్లాడు మాత్రమే కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తాడనే పాత కాలం మాట చిరు నోటి నుంచి రావడం చాలామందికి రుచించడం లేదు. దీనిపై చిరును చాలామంది టార్గెట్ చేస్తున్నారు.
ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ సైతం చిరును సమర్థించలేని పరిస్థితి. మరోవైపు తన తాత చాలా రసికుడు అంటూ ఆయన రెండో వివాహం, వివాహేతర సంబంధాల గురించి చిరు మాట్లాడిన మాటలు సైతం విమర్శలకు దారి తీశాయి.
ఈ మధ్య తరచుగా సినిమా ఈవెంట్లలో చిరు కనిపిస్తుండగా.. తన ప్రసంగాల్లో ఎక్కడో ఒక చోట మాట కాస్త అదుపు తప్పుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగు పెట్టి, నటుడిగా అసామాన్యమైన ఘనతలెన్నో సాధించి కోట్లమందికి స్ఫూర్తినివ్వడమే కాక.. సేవా కార్యక్రమాలతోనూ ఎంతో పేరు సంపాదించి.. పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న చిరు.. తన స్థాయి ఏంటో గుర్తుంచుకుని ఇకపై కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన అవసరాన్ని ఆయన శ్రేయోభిలాషులు గుర్తు చేస్తున్నారు.