అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన చిత్రం.. తండేల్. చైతూ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ.. ఈ సినిమా మీద నమ్మకంతో ఏకంగా 80 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. సినిమా మొదలు కావడానికి ముందే ఇది బ్లాక్ బస్టర్ అని ఫిక్సయిపోయింది టీం. మేకింగ్ దశలో, షూట్ పూర్తయ్యాక, రిలీజ్ ముందు.. ఇలా ప్రతి సందర్భంలోనూ టీం కాన్ఫిడెన్స్ కనిపిస్తూనే ఉంది.
చైతూ కెరీర్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో చూస్తారని.. అలాగే ఇది తన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని స్వయంగా నిర్మాత అల్లు అరవింద్ చాలా రోజుల ముందే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. బన్నీ వాసు సైతం ఇదే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాడు. చైతూ కెరీర్లో కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలవుతాయని.. ఇది వంద కోట్ల సినిమా అవుతుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడు ‘తండేల్’కు వస్తున్న స్పందన చూస్తుంటే ఆ మాటలు నిజమయ్యేలాగే కనిపిస్తోంది.
‘తండేల్’ తొలి రోజు చక్కటి వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ రూ.17 కోట్లకు పైగా గ్రాస్, రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ డే-1 గ్రాసర్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. చైతూ సినిమాలేవీ ఇప్పటిదాకా తొలి రోజు 10 కోట్ల షేర్ మార్కును కూడా టచ్ చేయలేదు. అలాంటిది ‘తండేల్’ రూ.12 కోట్ల షేర్ రాబట్టడం.. అది కూడా థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల వచ్చిన సినిమాతో ఈ వసూళ్లు సాధించడం అంటే విశేషమే.
ఇక అరవింద్ చెప్పినట్లు చైతూ హైయెస్ట్ గ్రాసర్ కావడం, బన్నీ వాసు చెప్పినట్లు వంద కోట్ల వసూళ్లను సాధించడమే మిగిలింది. ‘తండేల్’కు రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే ఉన్నాయి. తొలి రోజుకు దీటుగా వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. వీకెండ్ సినిమా దుల్లగొట్టేయడం ఖాయం. మూడు రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం కూడా కష్టమేమీ కాకపోవచ్చు.