కొత్త సినిమాల్లేవు.. ఆ మ‌ల్టీప్లెక్స్ ఏం చేస్తోందో తెలుసా?

ఏడు నెల‌ల క‌రోనా విరామం త‌ర్వాత ఈ నెల 15 నుంచి దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తులిచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. కానీ దేశంలో మెజారిటీ థియేట‌ర్లు ఇంకా మూత‌ప‌డే ఉన్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం అనుమ‌తులిచ్చినా చాలా వ‌ర‌కు థియ‌ట‌ర్లు తెర‌వ‌లేదు. అందుకు కార‌ణం 50 శాతం కెపాసిటీతో థియేట‌ర్లు న‌డుపుకోవాల‌ని ష‌ర‌తు విధించ‌డం, అలాగే కొత్త సినిమాలేవీ విడుద‌ల కాక‌పోవ‌డం. సింగిల్ స్క్రీన్లు దాదాపుగా అన్నీ మూత‌ప‌డే ఉన్నాయి.

మ‌ల్టీప్లెక్సుల్లో కూడా పెద్ద సంస్థ‌లు మాత్ర‌మే స్క్రీన్ల‌ను తెరిచాయి. కానీ వాటిలో సినిమాలు నామ‌మాత్రంగానే న‌డుస్తున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల మెయింటైనెన్స్ ఎలా?

ఇందుకే ఐనాక్స్ సంస్థ వినూత్న‌మైన ఐడియాతో ముందుకొచ్చింది. త‌మ మ‌ల్టీప్లెక్సుల్లో స్క్రీన్ల‌ను జ‌నాల‌కు అద్దెకివ్వాల‌ని నిర్ణ‌యించింది. మొత్తం స్క్రీన్‌ను బుక్ చేసుకుని ప్రైవేట్ స్క్రీనింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది ఐనాక్స్. అందులో కోరిన సినిమాలు కొత్త‌వైనా, పాత‌వైనా ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చు. అలాగే సినిమా వాళ్లు కూడా ఏవైనా మూవీ ఈవెంట్లు చేసుకోవ‌చ్చు. స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో గెట్ టు గెద‌ర్‌లు ఏర్పాటు చేసుకోవ‌చ్చు. బ‌ర్త్ డే పార్టీలు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వ‌హించుకోవ‌చ్చు. వ‌ర్క్ షాప్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

ఎలాగూ స్క్రీన్ల‌న్నీ ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు కొత్త సినిమాలు రిలీజ‌వుతాయో తెలియ‌దు. ఒక‌ట్రెండు స్క్రీన్ల‌లో నామ‌మాత్రంగా సినిమాల‌ను న‌డిపించి.. మిగ‌తా వాటిని ఇలా ప్రైవేట్ స్క్రీనింగ్‌, ఈవెంట్ల కోసం ఇచ్చి.. ఒక‌ప్ప‌ట్లా సినిమాలు న‌డిచే వ‌ర‌కు మెయింటైనెన్స్ అయినా రాబ‌ట్టుకోవాల‌ని ఐనాక్స్ చూస్తున్న‌ట్లుంది. ఈ ప‌ద్ధ‌తిని మిగతా మ‌ల్టీప్లెక్స్ ఛైన్స్ కూడా అనుస‌రించే అవ‌కాశ‌ముంది.