యూత్ హీరో నితిన్ కు డబుల్ సంకటం వచ్చి పడింది. రాబిన్ హుడ్ మార్చి 28 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అదే డేట్ కి హరిహర వీరమల్లు రాదేమోననే అనుమానంతో మైత్రి మూవీ మేకర్స్ ముందు జాగ్రత్తగా డేట్ వేసుకున్నారు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం వాయిదా వేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు.
పవర్ స్టార్ వీరాభిమానిగా నితిన్ ఆ రిస్క్ చేయడు. అసలు మైత్రి నిర్మాతలే దానికి సిద్ధపడరు. ఇంకోవైపు వీరమల్లు ప్రమోషన్లలో డేట్ మారడం లేదు. మార్చి 28నే చూపిస్తున్నారు. సో పోస్ట్ పోన్ లేకుండా ప్రస్తుతానికి దానికే కట్టుబడిన విషయం స్పష్టమవుతోంది.
ఒకవేళ ఇదే జరిగితే రాబిన్ హుడ్ మళ్ళీ నిర్ణయం మార్చుకోక తప్పదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడం అంచనాలు రేపుతోంది. ఇంకోవైపు తమ్ముడు షూటింగ్ చివరి దశకు వచ్చింది.
దిల్ రాజు ముందైతే శివరాత్రి రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యపడదు. సో వేసవికి వెళ్ళిపోవాలి. ప్యాన్ ఇండియా సినిమాలతో క్లాష్ లేకుండా చూసుకోవాలి. అందులోనూ రాబిన్ హుడ్, తమ్ముడు ల మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండటం నితిన్ మార్కెట్ దృష్ట్యా అవసరం. సో ఇప్పటికిప్పుడు ఏదీ నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఒకవేళ ముందు అనుకున్నట్టు రాబిన్ హుడ్ కనక డిసెంబర్ లోనే వచ్చి ఉంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కాదు. తమ్ముడుకి రూట్ క్లియరయ్యేది. కానీ అలా జరగకపోవడం ఈ డైలమాకు దారి తీసింది. నితిన్ కి రెండు ప్రతిష్టాత్మక సినిమాలే. బడ్జెట్లు కూడా పెద్దవే.
తమ్ముడుకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కు ఈ రెండే దేనికవే కీలకం. విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయి. కాకపోతే అనుకోకుండా వచ్చిన సంకటం వల్ల ఈ సమస్యని ఎదురుకోవాల్సి వచ్చింది. చూడాలి పరిష్కారం ఏమవుతుందో.