‘బిగ్ బాస్’లో నాగ్ స్థానంలోకి ఆమె?

అక్కినేని నాగార్జున వరుసగా రెండో ఏడాది కూడా ‘బిగ్ బాస్’ షోలో చిన్న గ్యాప్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని రోజుల కిందటే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి సీజన్లో నాగార్జున ఇలాగే కొన్ని రోజులు అందుబాటులో లేకుండా పోతే.. సీనియర్ నటి రమ్యకృష్ణతో కొన్ని రోజులు షోను నడిపించారు. ఆ ఎపిసోడ్లకు మంచి స్పందనే వచ్చింది. ఇక ఈ ఏడాది విషయానికొస్తే.. నాగార్జున అనుభవం మీద హోస్ట్‌గా బాగా కుదురుకుని చక్కగా షోను ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇలాంటి సమయంలో తన ‘వైల్డ్ డాగ్’ సినిమా ముఖ్యమైన షెడ్యూల్ కోసం నాగ్.. కులు మనాలికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో కొన్ని ఎపిసోడ్లకు తాత్కాలికంగా వేరే హోస్ట్‌గా పెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయంలో కొన్ని ఊహాగానాలు వినిపించాయి.

ఐతే తాజా సమాచారం ప్రకారం రమ్యకృష్ణ లాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రోజాను తీసుకొస్తున్నారట. జబర్దస్త్, బతుకు జట్కా బండి లాంటి కార్యక్రమాలతో బుల్లితెరపై రోజా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టేచర్ పరంగా ఆమె రమ్యకృష్ణకు తక్కువేమీ కాదు. మంచి మాటకారి, చమత్కారి అయిన రోజా.. బిగ్ బాస్‌ను బాగానే నడిపించగలదనే అనుకుంటున్నారు.

ఈ తాత్కాలిక మార్పు బిగ్ బాస్ ప్రేక్షకులకు కొంచెం భిన్నమైన అనుభూతిని కూడా పంచుతుందని భావిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఒకప్పుడు చిరంజీవి చేసిన ‘బిగ్ బాస్’ సినిమాలో కథానాయికగా నటించిన రోజా.. ఇప్పుడిలా ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా రాబోతోంది. ఇంతకీ ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకు ఎదురు చూడాలి.