SSMB 29 – మహేష్ పాస్ పోర్ట్ సీజ్

దర్శకధీర రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కబోతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్ లో వైరలైపోయి సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ విజువల్ గ్రాండియర్ రెగ్యులర్ షూటింగ్ లో అడుగు పెట్టనుంది.

ఇప్పటికే మహేష్, ప్రియాంకా చోప్రా మీద టెస్ట్ షూట్ చేసిన జక్కన్న త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. దీని గురించి ఎదురు చూస్తుండగానే నిన్న రాత్రి హఠాత్తుగా ఒక క్రేజీ మీమ్ లాంటి ప్రమోషన్ తో ఒక్కసారిగా అభిమానులతో పాటు సినీ ప్రియుల దృష్టిని లాగేసుకున్నారు.

సింహంని జైలులో బంధించి దాని పాస్ పోర్ట్ ని తీసేసుకున్నట్టు ఉన్న రాజమౌళి ఫోటోని ఇన్స్ టాలో స్వయంగా ఆయనే షేర్ చేయడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ మొదలైపోయింది. దానికి బదులుగా మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను అని కామెంట్ చేయడం మరింత కిక్ ఇచ్చింది.

మాములుగా గ్యాప్ వస్తే చాలు విదేశాలకు ఫ్యామిలీతో పాటు వెళ్లిపోవడం మహేష్ ఎప్పటి నుంచో చేస్తున్నదే. కానీ జక్కన్నతో అలా కుదరదు. ప్రాజెక్టు లాక్ అయ్యాక అలాంటివి సాధ్యపడవు. ఆ ఉద్దేశంతోనే పాస్ పోర్ట్ తీసుకున్నానని అర్థం వచ్చేలా పోస్ట్ చేయడం మాములుగా పేలలేదు.

ప్రియాంకా చోప్రా కూడా దీనికి రెస్పాండ్ కావడం మరింత ఆసక్తిని పెంచింది. ఓపెనింగ్ తాలూకు వీడియోని ఏమైనా రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ఇలా వెరైటీగా ప్లాన్ చేయడం రాజమౌళికే చెల్లింది. అడవి బ్యాక్ డ్రాప్ తో జంతువులు, నిధులు, సాహసాల నేపథ్యంలో ఇండియానా జోన్స్ రేంజ్ లో రాజమౌళి దీన్ని ప్లాన్ చేస్తున్నారు.

వెయ్యి కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని టాక్. అంతర్జాతీయంగా ఇంగ్లీష్ తో పాటు అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్రణాళిక వేస్తున్నారట. ఇప్పుడే ఇంత హీట్ ఉంటే చిత్రీకరణ మొదలయ్యాక లీక్స్ ఎలా ఉంటాయో ఊహకందడం కష్టం.