టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్‌లో అక్కినేని వారిది ముందు వరసలో ఉంటుంది. ఇటు అక్కినేని నాగార్జున, అటు నాగచైతన్య – అఖిల్‌లకు బాక్సాఫీస్ దగ్గర కొన్నేళ్ల నుంచి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నా సామిరంగ, బంగార్రాజు ఓ మాదిరిగా ఆడినా వైల్డ్ డాగ్, ఘోస్ట్ సినిమాలు నాగ్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అఖిల్ ఏజెంట్‌తో ఎంత పెద్ద ఎదురు దెబ్బ తిన్నాడో తెలిసిందే.
చైతూకేమో థాంక్యూ, కస్టడీ చిత్రాలు షాక్ కొట్టే ఫలితాన్నిచ్చాయి. వేరే హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే అక్కినేని ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో వారిలో ఓ సినిమా ఆశలు రేకెత్తిస్తోంది. అదే.. తండేల్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన పెద్ద బడ్జెట్ సినిమా ఇది. ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం.. వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తండేల్ మూవీ మొదలైనపుడే చైతూకు పెద్ద హిట్ గ్యారెంటీ అనే ఫీలింగ్ కలిగింది అందరికీ. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేటైంది. రిలీజ్ ముంగిట ఈ హైప్ ఇంకా పెరుగుతోంది. ఈ సినిమాపై నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవిందల్ ధీమా మామూలుగా లేదు. ఈ సినిమాను వంద కోట్ల క్లబ్బులో నిలబెడతామని ఆ మధ్య బన్నీ వాసు చాలా కాన్ఫిడెంట్‌గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడేమో అల్లు అరవింద్ ఈ చిత్రం చైతూ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని స్పష్టం చేశారు.
అరవింద్ ఆషామాషీగా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు. ప్రమోషన్ కోసం ఊరికే కామెంట్స్ చేసే రకం కాదు ఆయన. పుష్ప-2 చూసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌కు తగ్గట్లే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇదే కోవలో తండేల్ కూడా భారీ విజయం సాధిస్తుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. చాలా ఏళ్ల నుంచి అక్కినేని హీరోలకు పెద్ద హిట్ లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తండేల్ కరవు తీర్చే సినిమా అవుతుందని వాళ్లు ఎన్నో ఆశలతో ఉన్నారు. మరి తండేల్ వారి నమ్మకాన్ని నిలబెట్టేలా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.