పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన ప్రతి సినిమాకూ సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తూ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమాకు మాత్రం పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాడు. అతడికి ఖాళీ లేదో.. లేక తన వర్క్ నచ్చలేదో కానీ.. రిలీజ్ ముంగిట బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ కోసం తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్.. ఇలా ముగ్గురిని తీసుకున్నాడు సుకుమార్.
ముగ్గురికీ కొన్ని సీన్లు అప్పగించడం.. వాళ్లు ఔట్ పుట్ ఇవ్వడం.. చివరికి తమన్, అజనీష్‌ల వర్క్ పక్కన పెట్టి సామ్ సీఎస్ స్కోర్ మాత్రం తీసుకుని సినిమాలో కొన్ని సన్నివేశాలకు వాడుకోవడం తెలిసిందే. దీనిపై దేవిశ్రీ తన అసహనాన్ని ఓ ఈవెంట్లో వెళ్లగక్కేశాడు. అతడి పట్టుదల వల్లే టైటిల్ కార్డ్స్‌లో సంగీతం, నేపథ్య సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అని ప్రత్యేకంగా వేశారు. సామ్ సీఎస్‌కు ‘అడిషనల్ బీజీఎం’ అని క్రెడిట్ ఇచ్చారు.
ఐతే సినిమాలో చాలా వరకు దేవిశ్రీ స్కోరే వాడారని.. పరిమితంగా కొన్ని సన్నివేశాలకు మాత్రమే సామ్ వర్క్ తీసుకున్నారని యూనిట్ వర్గాలు చెప్పాయి. టైటిల్ కార్డ్స్ చూసినా ఇదే విషయం అర్థమైంది. కానీ సామ్ మాత్రం సినిమాలో 90 శాతం సన్నివేశాలకు తన స్కోరే వాడారని ఓ ఇంటర్వ్యూలో క్లైమ్ చేసుకున్నాడు. కానీ ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. సామ్ తన వర్క్ గురించి ఎక్కువ చేసి చెప్పుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో సామ్ మళ్లీ ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. ‘పుష్ప-2’ కోసం తాను ఎంత వర్క్ చేసింది చూపించడానికా అన్నట్లు ఈ సినిమా నుంచి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో మళ్లీ పుష్ప-2 బీజీఎం గొడవ మళ్లీ రాజుకున్నట్లు అయింది. మరి సినిమాలో ఉపయోగించిన తన వర్క్‌నే ఓఎస్టీ రూపంలో సామ్ రిలీజ్ చేస్తాడా.. లేక తాను టీంకు పంపిన ట్రాక్స్ విడుదల చేస్తాడా అన్నది ఆసక్తికరం.
మొత్తానికి అతను రిలీజ్ చేసే ఓఎస్టీని బట్టి సినిమాలోని బీజీఎంలో తన పాత్ర ఎంత అన్నది జనాలకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది.