బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను చూసుకోకుండా వేగంగా సినిమాలు చేయడంలో ఈయన ట్రాక్ రికార్డు ఎవరికీ లేదు. అక్షయ్ కొత్త మూవీ స్కై ఫోర్స్ రేపు భారీ ఎత్తున విడుదల కానుంది.
మంచినీళ్లలా బడ్జెట్ ఖర్చు పెట్టారు. ప్రమోషన్లు గట్టిగా చేశారు. టీమ్ వివిధ నగరాలు తిరుగుతూ అయ్యా థియేటర్ కొచ్చి చూడమని విన్నపాలు చేసుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో బజ్ లేకపోయింది. పైగా కాన్సెప్ట్ గత ఏడాది వచ్చిన హృతిక్ రోషన్ ఫైటర్ కి దగ్గరగా అనిపించడంతో ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించలేదు.
దీంతో రెగ్యులర్ పబ్లిసిటీ పనికిరాదని గుర్తించిన ప్రొడ్యూసర్లు డిస్కౌంట్ల మంత్రం జపించారు. ప్రత్యేకమైన ప్రోమో కోడ్ల ద్వారా 250 నుంచి 400 రూపాయల వరకు డిస్కౌంట్ వచ్చేలా బుక్ మై షోలో ఆఫర్ పెట్టారు. పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో టికెట్లు కొనేవాళ్ళకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది.
అంటే సగటు ప్రేక్షకుడికి ఒక్కో టికెట్ పాతిక నుంచి నలభై రూపాయల లోపే వచ్చేస్తోంది ఇదేదో బాగుందని మూవీ లవర్స్ బుక్ చేసుకోవడంతో స్కై ఫోర్స్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అలాని ఇది రోజూ ఉండే ఆఫర్ కాదట. కేవలం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లిమిటెడ్ ఆఫర్ పెట్టారు.
ఇదేదో బాగుంది కదూ. అయినా బాలీవుడ్ లో ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు వన్ ప్లస్ వన్ ఇచ్చిన సినిమాలు బోలెడున్నాయి. కానీ స్కై ఫోర్స్ ఇస్తున్నది మాత్రం మెగా డిస్కౌంట్. విమానయాన సాహసాల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో అక్షయ్ కుమార్ చాలా సాహసాలు చేశారు.
గత ఏడాది స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మాడాక్ ఫిలిమ్స్ దీన్ని నిర్మించింది. వచ్చే నెల ఫిబ్రవరి 14 చావా వచ్చేదాకా పోటీ లేకపోవడంతో టాక్ ని నమ్ముకుని బరిలో దిగుతోంది. బాగుంటే సరేసరి లేదంటే మళ్ళీ పుష్ప 2 ది రూల్ పికప్ అయినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.