సల్మాన్ మీద అక్షయ్ అలిగాడా?

వివిధ భాషల్లో కొత్త సినిమాలను ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో ప్రమోట్ చేయడం కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండ్. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది బాలీవుడ్డే. హిందీలోనే మొదటగా ఈ షో మొదలైంది. ఆ షోలో సినిమాల ప్రమోషన్ చేయడం కూడా ముందు మొదలుపెట్టింది అక్కడే. సంక్రాంతి సినిమా ‘గేమ్ చేంజర్’ను సైతం బిగ్ బాస్‌లో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రమోట్ చేయాలనుకున్నారు.

అక్షయ్‌తో పాటు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన వీర్ పహారియా సైతం షోకు వచ్చాడు. ఐతే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా అక్షయ్ అలిగి మధ్యలోనే వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అక్షయ్ ఈ షోకు వచ్చినట్లు ఆన్ లొకేషన్ ఫొటోలు బయటికి వచ్చినా.. పూర్తి ఎపిసోడ్‌లో కనిపించలేదు. చిత్రీకరణ కోసం సల్మాన్ ఆలస్యంగా రావడంతో అక్షయ్ అలిగి వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది.ఈ విషయమై అక్షయ్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు.

సల్మాన్‌తో తనకు విభేదాలున్నట్లు వచ్చిన వార్తలను సైతం అతను ఖండించాడు. ‘‘సల్మాన్ సెట్‌కు 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మాట వాస్తవం. కానీ అతను లేటుగా రావడం వల్ల నేను అలిగి సెట్ నుంచి వచ్చేయలేదు. నాకు వేరే సినిమా షూటింగ్ ఉంది. దానికి తప్పక హాజరు కావాలి. అందుకే బిగ్ బాస్ సెట్ నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సల్మాన్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. నేను వచ్చేసినా మా సినిమాను ప్రమోట్ చేయడం కోసం వీర్ పహారియా అక్కడే ఉన్నాడు.

అతను సల్మాన్‌తో కలిసి మా సినిమా విశేషాలను పంచుకున్నాడు. అంతకుమించి ఇందులో వివాదం ఏమీ లేదు’’ అని అక్షయ్ చెప్పడంతో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. మరోవైపు సైఫ్ మీద జరిగిన దాడి గురించి అక్షయ్ ఈ ఇంటర్వ్యూలో స్పందించాడు. కుటుంబం కోసం పోరాడిన రియల్ హీరో సైఫ్ అని ప్రశంసించాడు. తామిద్దరం కలిసి ‘మే ఖిలాడి తు అనారి’ అనే సినిమా చేశామని.. ఇప్పుడు మళ్లీ తాము కలిసి సినిమా చేయాల్సి వస్తే దానికి ‘తు ఖిలాడి మే అనారి’ అనే టైటిల్ పెట్టాల్సి ఉంటుందని అక్షయ్ సరదాగా వ్యాఖ్యానించాడు.