ఫ్యాన్ వార్ చేసే అభిమానులకు అజిత్ చురకలు

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగాక అభిమానుల్లో హీరోయిజం పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఒకప్పుడు రిలీజ్ రోజు హడావిడితో మొదలై వంద రోజో లేదా సిల్వర్ జూబ్లీకి హల్చల్ చేయడం దగ్గర ముగిసేది. కానీ ఇప్పుడలా కాదు. ట్విట్టర్. ఇన్స్ టా, ఫేస్ బుక్ లాంటివి వచ్చాక నిత్యం అదే ప్రపంచంలో మునిగి తేలుతూ హీరోల భజనలు, ట్రోల్స్ లో బోలెడంత సమయాన్ని వృథా చేసుకుంటున్న యువత కోట్లలో ఉంటోంది.

స్వంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా స్టార్లను ప్రేమించడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఈ ధోరణి కొన్నేళ్ల క్రితం ఏకంగా హత్యలు చేయడం దాకా వెళ్లిన సంగతి గుర్తే.

తాజాగా దీని మీద అజిత్ గట్టి చురకలు వేశాడు. దుబాయ్ లో జరిగిన 24హెచ్ రేసులో జయకేతనం ఎగరేశాక మీడియాతో కొన్ని ముచ్చట్లు పంచుకున్నాడు. అందులో భాగంగా మాట్లాడుతూ లాంగ్ లివ్ విజయ్, లాంగ్ లివ్ అజిత్ అంటూ మా గురించి ప్రార్థించకుండా ముందు ఎవరికి వారు వాళ్ళ స్వంత జీవితాల గురించి ఆలోచించుకుంటే అందరూ బాగుంటారని, నేను సంతోషంగా ఉన్నానని తనలాగే అభిమానులు కూడా బాగుండాలని కోరుకుంటానని హితవు పలికారు.

లైఫ్ చాలా చిన్నదని మన మనవళ్లు మనవరాళ్లు గుర్తు పెట్టుకునేంత అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడేం చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టాలని కోరారు.

ఒకరకంగా అజిత్ మాటలు చెంపపెట్టులాంటివి. హీరో నీ అభిమానించడం టికెట్ కొని సినిమా చూడటం దగ్గర ఆగిపోతే మంచిది. అంతే తప్ప అవతలి వర్గాన్ని నష్టపరచాలని ట్రోల్స్ చేయడం, పైరసీ ప్రింట్లను షేర్ చేసుకోవడం, కలెక్షన్ల గురించి బురద జల్లుకోవడం లాంటివి ఎలాంటి ప్రయోజనం ఇవ్వకపోగా మరింత కలవరానికి గురి చేస్తాయి.

తనకు అభిమాన సంఘాలే వద్దని అధికారికంగా నిషేదించిన హీరోగా అజిత్ మాటలు ఆషామాషీగా అనిపించవు. తమిళంలో అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవల్లాగే ఈ మధ్య తెలుగులోనూ స్టార్ హీరోల అభిమానుల మధ్య పెద్ద రచ్చలే జరుగుతున్నాయి.