నానా హైరానా.. ఇక నో హైరానా

ఈ సంక్రాంతికి షెడ్యూల్ అయిన‌ మూడు చిత్రాల్లో బిగ్గెస్ట్ మూవీ.. 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైంది. ఐతే ఆ అంచ‌నాల‌ను గేమ్ చేంజ‌ర్ పూర్తి స్థాయిలో అందుకోలేక‌పోయింది. కానీ వ‌సూళ్ల‌యితే బాగానే ఉన్నాయి. తొలి రోజు ఈ సినిమా చూసిన వాళ్ల‌కు పెద్ద అసంతృప్తి ఏంటంటే.. మూవీలో హైలైట్‌గా నిలుస్తుంద‌ని భావించిన‌ నానా హైరానా పాట లేక‌పోవ‌డం.

ఆ ఒక్క పాట మీద ప‌ది కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టింది చిత్ర బృందం. కాస్ట్లీ లొకేష‌న్ల‌లో, అనేక సాంకేతిక ఆక‌ర్ష‌ణ‌లు జోడించి ఈ పాట తీశారు. దీని ప్రోమో చూసి బిగ్ స్క్రీన్ మీద పాట చూడాల‌ని ఆతృత‌గా ఎదురు చూశారు ప్రేక్ష‌కులు. కానీ ఆ పాట ఏవో సాంకేతిక కార‌ణాల వ‌ల్ల సినిమాలో క‌నిపించ‌లేదు. ఐతే ఇక ఈ పాట సినిమాలో ఉండ‌దేమో అనుకుని నిరాశ ప‌డ్డారు కానీ.. టీం అలెర్ట్ అయి థియేట‌ర్ల‌లోకి ఈ పాట‌ను తీసుకొచ్చేసింది.

శ‌నివారం రాత్రి నుంచే కొన్ని థియేట‌ర్ల‌లో నానా హైరానా పాట థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం అయ్యింది. ఆదివారం పూర్తి స్థాయిలో అన్ని చోట్లా ఈ పాట‌ను యాడ్ చేశారు. విజువ‌ల్‌గా ఈ పాట అద్భుతంగా ఉంద‌ని.. లొకేష‌న్లు.. అలాగే కియారా అందాలు హైలైట్ అని అంటున్నారు. సినిమాలో కియారా గ్లామ‌ర్ గురించి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆమె కోసం సినిమా చూడొచ్చ‌ని త‌న ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు నానా హైరానా పాట కూడా సినిమాలో క‌ల‌వ‌డంతో అదొక ఆక‌ర్ష‌ణ‌గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.

తెలుగులో ఇప్ప‌టికే విన‌య విధేయ రామ సినిమా చేసిన‌ప్ప‌టికీ దాన్ని మించి ఇందులో కియారా హైలైట్ అయింది. ల‌వ్ స్టోరీ కొంచెం బోరింగ్ అనిపించినా.. కియారా మాత్రం సూప‌ర్ సెక్సీగా క‌నిపించి కుర్ర‌కారును ఆక‌ట్టుకుంది. నార్త్ ఆడియ‌న్స్ గేమ్ చేంజ‌ర్‌ను ఇష్ట‌ప‌డ‌డానికి కియారా కూడా ఒక కార‌ణం అన‌డంలో సందేహం లేదు.