‘ఫన్ బకెట్’ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు

ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా ఓ యూట్యూబర్ ను అంటూ ఫోజులు కొడుతున్నారు. ఇదంతా లేనప్పుడు… కేవలం యూట్యూబ్ వేదికగానే షార్ట్ ఫిల్మ్ లు, కామెడీ స్కిట్స్ చేసుకుంటూ ప్రాచుర్యంలో వచ్చిన చాలా మంది ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. అలాంటి వారిలో ఫన్ బకెట్ వీడియోలతో ఓ రేంజిలో పాపులారిటీని సంపాదించిన భాస్కర్ ఇప్పుడు దాదాపుగా కనిపించకుండాపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. లైంగిక వేధింపుల కేసులో అతడికి కోర్టు ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

విశాఖకు చెందిన భాస్కర్ ఫన్ బకెట్ వీడియోల్లో ప్రధాన నటుడిగా కనిపించే వాడు. కామెడీలో మంచి ఈజ్ ను చూపించిన భాస్కర్ ఓ రేంజిలో ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తనతో నటించిన ఓ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు కలకలం రేపాయి. ఈ మేరకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ విశాఖ పరిధిలోని కోర్టులో కొనసాగింది.

విచారణలో భాగంగా భాస్కర్ పై నమోదైన అభియోగాలు నిజమేనని పోలీసులు పలు కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన కోర్టు… భాస్కర్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిర్ధారించింది. వెరసి ఈ కేసులో అతడిని దోషిగా తేల్చిన కోర్టు… అందుకు గాను అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి పరిహారం కింద రూ.4 లక్షలు చెల్లించాలని భాస్కర్ ను ఆదేశించింది. ఈ తీర్పుతో భాస్కర్ కెరీర్ ముగిసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.