ప్రీమియర్ షోల రద్దు కుదరదన్న హైకోర్టు

కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా ప్రదర్శిస్తున్న ప్రీమియర్ షోలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంగా ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రమాదాలు జరిగాయని అంతరిక్ష ప్రయోగాలను కూడా ఆపాలంటారా? అంటూ కోర్టు పిటిషనర్ ను నిలదీసింది. ప్రమాదాలు జరుగుతాయని ఎవరూ కోరుకోరని, అలా అని ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రతి దానిని నిలుపుదల చేసుకుంటూ వెళ్లడం సాధ్యం కాదన్న అర్థం వచ్చేలా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి నుంచి ఈ తరహా ప్రశ్న ఎదురు కావడంతో పిటిషనర్ ఖంగు తిన్నారు. కోర్టు చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో కూడా తెలియక పిటిషనర్ తరఫు న్యాయవాది అయోమయానికి గురయ్యారు. ఈ ఘటన బుధవారం ఏపీ హైకోర్టులో చోటుచేసుకుంది.

గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్. నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాల ప్రీమియర్ షోలను రద్దు చేయాలంటూ గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రీమియర్ షోలను రద్దు చేయడంతో పాటుగా టికెట్ల దరలను 14 రోజుల వరకు పెంచుకోవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సినిమాల నిర్మాతలకు అవకాశం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదించారు. గేమ్ ఛేంజర్ హీరో రాంచరణ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అన్న కుమారుడని, డాకు మహారాజ్ హీరో బాలకృష్ణ సీఎం చంద్రబాబుకు వియ్యంకుడని ఆయన వాదించారు.

ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై ఇంటికి వెళుతున్న క్రమంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని అర్థరాత్రి వేళల్లో ప్రదర్శించే ప్రీమియర్ షోలను రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న న్యాయమూర్తులు ఇదెక్కడి వాదన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్లి వస్తూ… రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణించారు… కాబట్టి ప్రయోగాలు ఆపెయ్యాలి అన్నట్లుంది మీ వాదన అంటూ వారు మండిపడ్డారు. ఇలాంటి వాదనలు చెల్లవని తేల్చిచెప్పారు. న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేసినంతనే న్యాయవాదికి నోట మాట రాలేదట. అనంతరం ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో ప్రకారం పెంచిన టికెట్ రేట్లను అమలు చేసే రోజుల సంఖ్యను తగ్గిస్తామన్న కోర్టు.. ప్రీమియర్ షోల రద్దు మాట ఎత్తొద్దని పిటిషనర్ కు ఒకింత స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చిందట.