సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. టీఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ఈ రోజు ఉదయం కిమ్స్ ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్ తో పాటు రేవతి భర్త భాస్కర్ ను పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి భాస్కర్ ను అల్లు అర్జున్ అడిగి తెలుసుకున్నారు.
రేవతి కుటుంబానికి, శ్రీ తేజ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ భరోసానిచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ సంఖ్యలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని కిమ్స్ చుట్టు పక్కల భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆయన ఈ రోజు ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్..శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాలనుకుంటే ముందుగా సమాచారం ఇవ్వాలని, అప్పుడే తగినంత భద్రత కల్పిస్తామని పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది.