ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి ఒరిజినల్ మేకర్స్‌కు సమాచారమే తెలిసేది కాదు. కానీ ఈ సోషల్ మీడియా కాలంలో సమాచారం ప్రపంచం నలు మూలలకూ చేరుతోంది. మన సినిమాల ఎక్స్‌పోజర్ పెరిగి వాటి గురించి దేశ విదేశాల్లో తెలుస్తోంది. ఈ క్రమంలో తమ సినిమాలను కాపీ కొట్టారని తెలిసిన విదేశీ ఫిలి మేకర్స్ ఊరుకోవట్లేదు. లీగల్ చర్యలకు సిద్ధమైపోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ని తన చిత్రం ‘లార్గో వించ్’ను కాపీ కొట్టి తీశారంటూ దాని దర్శకుడు అప్పట్లో పెద్ద గొడవే చేశాడు. ఐతే లీగల్ యాక్షన్ వరకు వెళ్లకుండానే ఇష్యూ సెటిలైనట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ మాత్రం.. తమిళ సినిమా ‘విడాముయర్చి’ విషయంలో అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. అజిత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో మగిల్ తిరుమణి రూపొందిస్తున్న ‘విడాముయర్చి’ సినిమాకు.. పారామౌంట్ వారి ‘బ్రేక్ డౌన్’ స్ఫూర్తి అంటున్నారు.
ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. విషయం పారామౌంట్ వరకు వెళ్లి.. వాళ్లు లీగల్ చర్యలకు సిద్ధమయ్యారు. తమ సినిమా కథను, సన్నివేశాలను కాపీ కొట్టినందుకు రూ.85 కోట్లు కట్టాలని పారామౌంట్.. లైకా వాళ్లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడడానికి ఈ గొడవే కారణం.
ఐతే రిలీజ్‌కు ముందే రూ.85 కోట్లు చెల్లిస్తే తమకు భారీ నష్టం తప్పదని లైకా భావిస్తోంది. ఇందుకోసం ఒక రాజీ డీల్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. సినిమాలో వాటా ఇస్తామని, భాగస్వామి కావాలని పారామౌంట్ వారికి ఆఫర్ ఇచ్చారట. కథను వాడుకున్నందుకు నిర్మాణంలో కొంత వాటా ఇచ్చి ఆ మేరకు బిజినెస్‌లో షేర్ ఇవ్వాలని లైకా అధినేతలు భావిస్తున్నారు. ఈ డీల్ ఓకే అయ్యాకే సినిమా రిలీజ్ సంగతి తేలనుంది.