సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించడాన్ని పెద్ద పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా గొప్ప అవకాశంగా భావిస్తారు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల చాలా ఎగ్జైట్ అవుతారు. కానీ తమిళ సీనియర్ నటి ఖుష్బు మాత్రం రజినీ సినిమాలో నటించినందుకు చాలా ఫీలవుతోంది. గతంలో రజినీ సరసన కథానాయికగా నటించిన ఖుష్బు.. కొన్నేళ్ల కిందట ఆయన హీరోగా వచ్చిన అన్నాత్తె చిత్రంలో క్యారెక్టర్ రోల్ చేసింది. ఇందులో మరో సీనియర్ నటి మీనా కూడా అలాంటి పాత్రలోనే నటించింది.
వీళ్లిద్దరి స్థాయికి తగిన పాత్రలు కావవి. సినిమాలో ఉన్నారంటే ఉన్నారు అనిపిస్తారు వాళ్లిద్దరూ. ఈ సినిమాలో తమ పాత్రల గురించి ముందు చెప్పింది ఒకటి.. తర్వాత తీసింది ఇంకోటి అని ఖుష్బు అన్నారు. ఈ సినిమాలో తాను, మీనా నటించాల్సింది కాదని ఆమె వ్యాఖ్యానించారు. అన్నాత్తె పేరెత్తకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
”ఇప్పటిదాకా చాలా సినిమాల్లో నటించా. కొన్ని చిత్రాల్లో నటించినందుకు బాధ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్లో నేను తక్కువ సినిమాలే చేశా. కాబట్టి అక్కడి సినిమాల గురించి అలా ఫీలయ్యే పరిస్థితి లేదు. కానీ దక్షిణాదిన నేను చేసిన కొన్ని సినిమాల గురించి ఆలోచిస్తే.. వాటిలో భాగం కాకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నేళ్ల కిందట విడుదలైన రజినీకాంత్ సినిమా అలాంటిదే. నరేషన్ టైంలో నా పాత్ర గురించి చెప్పిన విధంగా స్క్రీన్ మీదికి తీసుకురాలేదు. అందులో నేను, మీనా నటించాం.
మావే కీలక పాత్రలు అని మొదట్లో చెప్పారు. రజినీతో మాకు డ్యూయెట్స్ కూడా ఉంటాయని చెప్పారు. రజినీకి జోడీగా వేరే హీరోయిన్ ఉండదని భావించి ఆ సినిమా అంగీకరించా. నా పాత్ర నాకెంతో నచ్చింది. కానీ సినిమా పట్టాలెక్కే సమయానికి అంతా మారిపోయింది” అని ఖుష్బు వ్యాఖ్యానించారు. అన్నాత్తె పేరు చెప్పకపోయినా.. ఖుష్బు చెప్పింది ఆ సినిమా గురించే అన్నది స్పష్టం. ఇందులో నయనతార కథానాయికగా నటించగా.. కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా కీలక పాత్ర చేసింది.