బిగ్‌బాస్‌లో హీటెక్కుతున్న ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ

బిగ్ బాస్‌లో ప్ర‌తి ఏడాదీ కొన్ని ల‌వ్ స్టోరీలు చూస్తుంటాం. ఇది హిందీ బిగ్ బాస్ నుంచి చూస్తున్న వ్య‌వ‌హార‌మే. ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్‌లో ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డుస్తుండ‌టం విశేషం. హీరోయిన్ మోనాల్ గజ్జ‌ర్ కోసం హౌస్‌లోని ఇద్ద‌ర‌బ్బాయిల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోందిప్పుడు. అది రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. ఆ ఇద్ద‌రబ్బాయిలు అభిజిత్, అఖిల్.

హౌస్‌లో మూడో వారం నుంచే అభిజిత్, అఖిల్ మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయి. వాళ్లిద్ద‌రూ మోనాల్ కోస‌మే ప్ర‌ధానంగా గొడ‌వ ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. గ‌త వారం వీళ్లిద్ద‌రి గొడ‌వ కార‌ణంగా మోనాల్ బోరున ఏడ్చేసింది కూడా. అయినా కూడా ప‌రిస్థితి మార‌డం లేదు. వ‌రుస‌గా బిగ్ బాస్ ప్రోమోల‌న్నీ ఈ ముగ్గురి ట్ర‌యాంగిల్ లవ్ స్టోరీ మీదే వ‌స్తుండ‌టం విశేషం.

ఇటీవ‌ల మోనాల్ విష‌యంలో అభిజిత్‌, అఖిల్ గొడ‌వ ప‌డ‌టంపై నాగార్జున సీరియ‌స్ కూడా అయ్యారు. కాగా.. మోనాల్ ఈ ఇద్ద‌రితో డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌న్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఒక‌రి ద‌గ్గ‌ర మ‌రొకరి గురించి నెగెటివ్‌గా మాట్లాడి.. ఇద్ద‌రూ ఉన్న‌పుడు ఇంకోలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఆమెపై వ‌స్తున్నాయి. దీనిపై ఒక సంద‌ర్భంలో అభిజిత్‌.. మోనాల్‌ను నిల‌దీశాడు కూడా.

ఏదేమైన‌ప్ప‌టికీ మ‌సాలా త‌గ్గింద‌నుకుంటున్న ద‌శ‌లో ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ బిగ్ బాస్‌ను హీటెక్కిస్తున్న మాట వాస్త‌వం. ఇదిలా ఉంటే ప్ర‌తి చిన్న విష‌యానికీ మోనాల్ ఎమోష‌న‌ల్ అవుతుండ‌టం, ఏడుపు అందుకుంటుండ‌టంతో తొలి సీజ‌న్లో విప‌రీతంగా ఏడ్చి ఏడ్చి ప్రేక్ష‌కుల‌కు చిరాకు తెప్పించిన గాయ‌ని మ‌ధుప్రియ బిగ్ బాస్ వ్యూయ‌ర్స్‌కు గుర్తొస్తోంది.