మలయాళంలో ఎన్నో ఏళ్ల నుంచి నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు మోహన్ లాల్. తన తరంలో మమ్ముట్టితో పాటు కొత్త తరంలో అనేకమంది యంగ్ హీరోల నుంచి గట్టి పోటీ ఉన్నా.. నిలకడగా బ్లాక్ బస్టర్లు కొడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారాయన. ఐతే ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయని సాహసం ఈ ఏడాది ఆయన చేశారు. స్వీయ దర్శకత్వంలో ‘బరోజ్’ అనే భారీ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రానికి నిర్మాతగా ఆయన పేరు పడలేదు కానీ.. ప్రొడక్షన్ అంతా ఆయనదే.
ఆశీర్వాద్ సినిమాస్ అంటే ఆయన సొంత సంస్థ లాంటిదే. మోహన్ లాల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాల్లో ఇదొకటి. ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ పీరియడ్ మూవీని. ఐతే చివరికి ఇది మోహన్ లాల్ చేసిన కాస్ట్లీ మిస్టేక్ అనే పేరు తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం.. విడుదల తర్వాత ఆశించిన స్పందన రాబట్టుకోలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ చాలా బోరింగ్‌గా సాగడంతో ‘బరోజ్’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
మామూలుగా మోహన్ లాల్ సినిమాలంటే టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఈ చిత్రం తొలి రోజు కేరళలో రూ.3 కోట్ల లోపు వసూళ్లు మాత్రమే రాబట్టింది. వీకెండ్లో కేవలం రూ.6 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఈ సినిమా మీద పెట్టి బడ్జెట్, జరిగిన బిజినెస్‌తో పోలిస్తే ఈ వసూళ్లు దారుణం అన్నట్లే. గత వారం రిలీజైన ఉన్ని ముకుందన్ సినిమా ‘మార్కో’ అదిరిపోయే టాక్ తెచ్చుకుని వసూళ్ల మోత మోగిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాని దూకుడు ముందు ‘బరోజ్’ ఏమాత్రం నిలవలేకపోయింది. ఉన్ని ముకుందన్.. లాల్‌తో పోలిస్తే చిన్న హీరో. అలాంటి నటుడి సినిమా ముందు లాల్ మూవీ వెలవెలబోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హీరో లేక లేక దర్శకత్వం చేస్తే.. ఇలాంటి ఫలితం రావడం వారికి పెద్ద షాక్. మళ్లీ లాల్ మెగా ఫోన్ పట్టే సాహసం చేయలేనంత దారుణమైన ఫలితాన్ని అందించింది ‘బరోజ్’.