కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. తన దగ్గరే చాలా ఏళ్లు పని చేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు వచ్చాక కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న జానీ.. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తర్వాత జైలు పాలయ్యాడు. దాదాపు రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు.
అప్పట్నుంచి మీడియాకు అవకాశం దొరికినపుడల్లా తన మీద వచ్చిన ఆరోపణల గురించి జానీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ అతను స్పందించడం లేదు. ఐతే తాజాగా జానీ మీద పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అందులో అతడి మీద తీవ్ర అభియోగాలే ఉన్నాయి. జానీని ఈ కేసులో గట్టిగానే బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఛార్జ్ షీట్ నమోదైన కొన్ని గంటలకే జానీ ఒక సెల్ఫీ వీడియోతో సోషల్ మీడియాను పలకరించాడు. తనపై వచ్చిన ఆరోపణల గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడనని జానీ చెప్పాడు.
తనేంటో, తానేం చేశాడో తన మనసుకు తెలుసని.. అలాగే దేవుడికి కూడా అన్నీ తెలుసని జానీ వ్యాఖ్యానించాడు. తాను ఏ తప్పూ చేయలేదని.. తాను ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి వస్తానని అతను ధీమా వ్యక్తం చేశాడు. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందని.. అక్కడ తాను ఏ తప్పు చేయలేదని తేలుతుందని.. తనకు న్యాయం జరుగుతుందని జానీ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం తాను కుటుంబంతో సంతోషంగా ఉన్నానని.. మళ్లీ సినిమాలకు పని చేస్తున్నానని.. ఈ కేసులో తాను పోరాటం సాగిస్తానని.. నిర్దోషిగా బయటికి వచ్చాక ఆ రోజు తాను ఏం చెప్పాలనుకున్నానో అదంతా చెబుతానని జానీ అన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు అతను థ్యాంక్స్ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates