కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు ఆక్యుపెన్సీలు బాగా పడిపోతున్నాయనే ఆవేదన ఇండస్ట్రీ జనాల్లో ఉంది. ఓటీటీల పుణ్యమా అని థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ మీద తీవ్ర ప్రభావమే పడింది. ఐతే ప్రేక్షకులు థియేటర్లలో చూడాలనుకునే సినిమాల విషయంలో కూడా వారిని పునరాలోచనలే పడేలా చేస్తున్నాయి ఇటీవలి పరిణామాలు.
పెద్ద సినిమాలాకు బడ్జెట్ ఎక్కువ పెట్టి, అందుకు తగ్గట్లుగా బిజినెస్ చేస్తుండగా.. భారీ పెట్టుబడులను వెనక్కి రాబట్టుకునేందుకు బెనిఫిట్ షోలు, అదనపు రేట్ల మీద దృష్టిసారిస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది కదా అని అయిన కాడికి రేట్లు పెంచేయడం ప్రేక్షకులకు మంటెత్తిపోయేలా చేస్తోంది. చివరగా తెలుగు నుంచి వచ్చిన పెద్ద సినిమా ‘పుష్ప-2’కు ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేసి ఏకంగా వెయ్యి రూపాయల టికెట్ రేటు పెట్టేశారు.
తర్వాతి రోజు కూడా మల్టీప్లెక్సులో సినిమా చూడాలంటే 600, సింగిల్ స్క్రీన్ అయితే 400 దాకా సమర్పించుకోవాల్సిన పరిస్థితి. సినిమా చూడాలని ఆసక్తి ఉన్నా.. ఈ రేట్లు చూసి వెనకంజ వేసిన ప్రేక్షకుల సంఖ్య పెద్దదే. ముఖ్యంగా ఫ్యామిిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరం కావడానికి అధిక టికెట్ల ధరలే ప్రధాన కారణం. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీలు లేవన్నది స్పష్టం. ఇదే విషయాన్ని నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎగ్జిబిటర్లు కుండబద్దలు కొట్టేశారు.
ఓ థియేటర్లో పుష్ప-2కు అధిక రేట్లు పెట్టి కూడా ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల రూ.13 లక్షల వసూళ్లు రాగా.. ‘కల్కి’ సినిమా తక్కువ రేట్లతోనే ఎక్కువ ఆక్యుపెన్సీలతో రూ.18 లక్షలు కలెక్ట్ చేసిందని ఓ ఎగ్జిబిటర్ చెప్పారు. అధిక రేట్ల వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న విషయాన్ని ఎగ్జిబిటర్లు ముక్తకంఠంతో చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, అదనపు రేట్లు ఇవ్వబోమంటూ చేసిన ప్రకటనపై ఎగ్జిబిటర్లు సానుకూలంగా స్పందించడం విశేషం. దీన్ని బట్టి అధిక రేట్ల తాలూకు దుష్ప్రభావాన్ని, ప్రేక్షకుల అసహనాన్ని ఎగ్జిబిటర్లు బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.