పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతుండడం ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో తెలిసిందే. ఈ దెబ్బతో ఇకపై టాలీవుడ్ స్టార్లు జనాల్లోకి రావడానికి భయపడే పరిస్థితి తలెత్తింది. రాబోయే రోజుల్లో పెద్ద స్టార్లు ఎవరూ తమ సినిమాలు చూడ్డానికి థియేటర్లకు రాకపోవచ్చు. అదే సమయంలో పెద్ద స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్లు చేయడానికి కూడా సందేహించే పరిస్థితి తలెత్తింది.
సినిమా ఈవెంట్లకు తెలంగాణ పోలీసుల నుంచి అనుమతులు సంపాదించడం కూడా కష్టంగా మారొచ్చు. ‘దేవర’ సినిమాకు ఈవెంట్ చేద్దాం అనుకుని ఏర్పాట్లన్నీ చేశాక.. అభిమాన సందోహం అసాధారణ స్థాయికి చేరడంతో ఆ ఈవెంట్ రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2కు జరిగింది చూశాక సినిమా ఈవెంట్లు అంటేనే అందరూ భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం తీరును కూడా గమనించిన టాలీవుడ్ నిర్మాతలు.. రాబోయే పెద్ద సినిమాలకు హైదరాబాద్‌లో పెద్ద ఈవెంట్లు ఏవీ ప్లాన్ చేయట్లేదు.
ప్రతి పెద్ద సినిమాకూ హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడం మామూలే. కానీ సంక్రాంతి సినిమాలు ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’లకు మాత్రం హైదరాబాద్‌లో పెద్ద ఈవెంట్ ఏదీ చేయట్లేదు. ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకటి ఇప్పటికే అమెరికాలో చేశారు. ఇంకో పెద్ద ఈవెంట్ ఆంధ్ర ప్రాంతంలో చేయబోతున్నారు. ‘డాకు ముహారాజ్’కు కూడా యుఎస్‌లో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆంధ్రలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తాజాగా వెల్లడించారు.
హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రం చిన్న స్థాయిలో చేయబోతున్నారు. మరో సంక్రాంతి సినిమా ‘సంక్రాంతికి కలుద్దాం’కు హైదరాబాద్‌లో చిన్న స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలనుకుంటున్నారు. ఆంధ్రలో కూడా ప్రమోషనల్ ఈవెంట్ ఒకటి చేయొచ్చు. మొత్తానికి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెద్ద చిత్రాలకు హైదరాబాద్‌లో భారీ ఈవెంట్లు ఏవీ ఉండకపోవచ్చు.