ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ‘పుష్ప-2’ ప్రిమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

అయితే ప్రభుత్వం ఈ విషయంలో మరీ పట్టుదలకు పోదనే ఇండస్ట్రీ జనాలు ఆశిస్తున్నారు. త్వరలోనే సినీ పెద్దలు ప్రభుత్వ పెద్దల్ని కలిసి సమస్యకు పరిష్కారం కనుగొంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమా ‘డాకు మహారాజ్’ను ప్రొడ్యూస్ చేసిన సూర్యదేవర నాగవంశీ.. తమ చిత్రానికి తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మధ్య ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. ‘పుష్ప-2’కు కూడా అలాగే చేశారు.

మరి మీ చిత్రానికి కూడా అలాగే ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉంటాయా అని నాగవంశీని అడిగితే.. సంక్రాంతి సినిమాలు వేటికీ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉండకపోవచ్చని నాగవంశీ అన్నాడు. తమ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

మరి బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి ప్రకటించారు కదా అని అడిగితే.. నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన వచ్చాక ఏదో ఒకటి తేలుతుందని.. సంక్రాంతికి ఆయన సినిమా ‘గేమ్ చేంజర్’యే ముందు రిలీజ్ కాబోతోందని.. దానికి ఎలా ఉంటుందో తమ సినిమాకూ అంతే అని వ్యాఖ్యానించాడు నాగవంశీ.

ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ మిడ్ నైట్ షోలు వేయడం తప్పయిందని నాగవంశీ గతంలో వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’కు కూడా మిడ్ నైట్ షోలు ఉండకపోవచ్చు. తెల్లవారుజామున షోలే అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని బట్టే ఆ షోలు కూడా ఉంటాయి.