వైజ‌యంతీ మూవీస్.. పేరు వెనుక క‌థ‌

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు అగ్ర నిర్మాత అశ్వినీద‌త్. ఆయ‌న సంస్థ వైజ‌యంతీ మూవీస్‌ది టాలీవుడ్లో దాదాపు ఐదు ద‌శాబ్దాల ప్ర‌స్థానం. మ‌హాన‌టి సినిమాతో ఆ సంస్థ మ‌రోసారి త‌న స్థాయిని చాటిచెప్పింది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని త‌ల‌పెట్టిన ఈ సంస్థ మ‌రో మెట్టు ఎక్క‌బోతోంది.

ఈ నేప‌థ్యంలో వింటేజ్ వైజయంతి’ పేరుతో సంస్థ‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విశేషాల్ని వెల్ల‌డిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి వీడియోను వైజ‌యంతి మూవీస్ పంచుకుంది. రానా ద‌గ్గుబాటి వాయిస్‌తోనే ఈ వీడియో రూపొంద‌డం విశేషం. ఈ వీడియోలో వైజయంతి మూవీస్ సంస్థ‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆ పేరు ఎవ‌రు పెట్టార‌నే విష‌యాల్ని రానా పంచుకున్నాడు.

అశ్వనీదత్ 21 ఏళ్ల వ‌య‌సులో విశ్వనాధ్ సినిమా ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఐతే నందమూరి తారక రామారావుగారితో సినిమా తీయాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌. ప‌ట్టువదలని విక్రమార్కుడిలా క‌ష్ట‌ప‌డి ఎన్టీఆర్ అపాయింట్‌మెంట్ సాధించారు. ఆయనతో సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో ఎన్టీఆర్‌కు చెప్పారు.

ద‌త్ మాటలకు ముచ్చటేసి ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వనీదత్ బేన‌ర్ కూడా స్థాపించలేదు. ఎన్టీఆర్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. బేన‌ర్ పేరేంటి అని. విజయా సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ మ‌న‌సులో మాట అట‌. కానీ బయటపెట్టలేదు.

అప్పుడే ఎన్టీఆర్.. అక్క‌డే ఉన్న కృష్ణుడి ఫొటోని చూపించి ఎన్నటికీ వాడిపోని వైజయంతి.. అదే నీ సంస్థ అని చెప్పారట‌. అప్పుడు స్వీయ ద‌స్తూరితో ‘వైజయంతి మూవీస్’ అని రాసి ఇచ్చార‌ట‌. ఎన్టీఆర్‌తో ఈ బేన‌ర్లో ద‌త్ చేసిన తొలి సినిమా ‘ఎదురులేని మనిషి’ స‌ప‌ర్ హిట్ అయింది. త‌ర్వాత ఆయ‌న వెనుదిరిగి చూసుకోలేదు.