ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో లాంటి ఫుల్ లెన్త్ హిట్స్ తో పాటు స్పెషల్ సాంగ్ చేసిన రంగస్థలం కూడా బోలెడు పేరు తీసుకొచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా తెలుగు, తమిళ, హిందీలో క్యూ కట్టినట్టు డిజాస్టర్లు పలకరించడంతో ఒక్కసారిగా వెనుకబడిపోయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసీకా భాయ్ కిసీకా జాన్, సర్కస్ ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టేయడంతో అవకాశాలు మందగించాయి. కానీ ఇప్పుడు బుట్టబొమ్మ మరోసారి తెగ బిజీ అయిపోయింది.
ఆఫర్లు తిరిగి మొదలయ్యాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 షూటింగ్ అయిపోయింది. ఇది గ్యాంగ్ స్టర్ లవ్ స్టోరీ అని టాక్. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు తలపతి విజయ్ చేస్తున్న చివరి చిత్రంలో ఈమే హీరోయిన్. ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం బలంగా ఉంది. లారెన్స్ రాఘవేంద్ర కాంచన 4లో లాక్ అవ్వడం దాదాపు ఖరారే. అతి త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ దాదాపు ఫిక్స్ అయినట్టే. షాహిద్ కపూర్ దేవా జనవరి చివరి వారంలో రిలీజ్ కానుంది. వరుణ్ ధావన్ తో డేవిడ్ ధావన్ రూపొందించే కామెడీ మూవీలోనూ పూజా హెగ్డే ఉంది.
మొత్తంగా చూసుకుంటే తెలుగులో తప్ప ఇతర భాషల్లో పూజా హెగ్డేకు మంచి అవకాశాలే ఉన్నాయి. గుంటూరు కారంలో చేయాల్సిన పాత్ర అనుకోకుండా శ్రీలీలకు వెళ్ళిపోయాక ఇక్కడ మళ్ళీ వెల్కమ్ దక్కలేదు. కథలు రావడం లేదో లేక దర్శకులు ఆసక్తి చూపించడం లేదో ఏమో కానీ తిరిగి రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అయితే తెలుగులోనూ ఉన్నారు. కాంచన 4 లో మాత్రం రెగ్యులర్ గా కాకుండా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ అనిపించేలా లారెన్స్ తన పాత్రను డిజైన్ చేశాడట. మరి తమన్నా, రాశిఖన్నా లాగా దెయ్యాల రూటు ఏమైనా పడుతుందేమో చూడాలి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ నెలలోనే రావొచ్చు.