శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ ఛేంజర్ విడుదల దగ్గరపడుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పీక్స్ కు చేరుకుంటోంది. ఇంకో ఇరవై రెండు రోజులు మాత్రమే ఉండటంతో సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సీజన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఓపెనింగ్ రికార్డులు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటం బజ్ మీద ప్రభావం చూపించినప్పటికీ క్రమంగా దీని గురించి తెలుస్తున్న సంగతులు ఆసక్తిని పెంచుతున్నాయి. శంకర్ స్క్రిప్ట్ విషయంలో ఎంత హోమ్ వర్క్ చేశారో తెలుసుకోవాలంటే ఈ ప్రత్యక్ష ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది.
గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ విభాగంలో ఎస్ వెంకటేశన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఈయన తమిళనాడు మధురై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ). రామ్ చరణ్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ క్యారెక్టర్ డిజైన్ చేయడంలో వెంకటేశన్ చాలా విలువైన ఇన్ ఫుట్స్ ఇచ్చారు. రాజకీయ నాయకుడిగానే కాక రచయితగానూ ఈయనకు పెద్ద పేరుంది. వీర యుగ నాయగన్ అనే సుప్రసిద్ధ నవల వెంకటేశన్ కలం నుంచి వచ్చిందే. శంకర్ దీని హక్కులు కొని భవిష్యత్తులో మూడు భాగాల ప్యాన్ ఇండియా మూవీగా తీసే ఆలోచనలో ఉన్నారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య బంధం బలపడింది.
మరో నవల కావల్ కొట్టంకు సాహిత్య అకాడెమి అవార్డు అందుకున్న వెంకటేశన్ గేమ్ చేంజర్ సెట్లకు రెగ్యులర్ గా వస్తూ తగిన సూచనలు సలహాలు ఇచ్చేవారట. చరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్, కలెక్టర్లు వ్యవరించే తీరు మీద స్వయంగా శిక్షణ ఇచ్చి బెస్ట్ వచ్చేలా చేశారని యూనిట్ సమాచారం. ఆషామాషీగా ఏదో పాత్రను సృష్టించి దాని చుట్టూ కమర్షియాలిటీ పేరుతో లేనిపోని క్రియేటివిటీ చూపించకుండా ఇంత కష్టపడతారు కాబట్టే శంకర్ మాస్టర్ అయ్యారు. ఓవర్సీస్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయిన గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు డిసెంబర్ 21 యుఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఊపందుకోనున్నాయి.