గేమ్ ప్లాన్ మార్చమంటున్న మెగా అభిమానులు!

జనవరి 10 దగ్గరికి వస్తోంది. ఈ శనివారమే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరిగిపోయాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. అయినా సరే మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న దాఖలాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కారణం ఆశించిన స్థాయిలో బజ్ ఇంకా పెరగలేదని వాళ్ళ ఫీలింగ్. వచ్చిన మూడు పాటల్లో రెండు ఛార్ట్ బస్టర్స్ అయినప్పటికీ మరీ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో వెళ్లలేదన్నది ఒక వెర్షన్. తమన్ డాకు మహారాజ్ కు ఇచ్చిన టైటిల్ సాంగ్ అంత ఫ్రెష్ గా చరణ్ కోసం కంపోజ్ చేసినవి లేవనేది మరికొన్ని కామెంట్స్. బజ్ ఇంకా చాలా పెరగాల్సి ఉంది.

పుష్ప 2 ది రూల్ తర్వాత వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజరే. దాని రికార్డులు బద్దలు కొట్టినా కొట్టకపోయినా కనీసం ఓ అయిదారు వందల కోట్లు దాటితే తప్ప చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. ఇది జరగాలంటే భారీ ఓపెనింగ్స్ కళ్లచూడాలి. అంటే ఎక్కడ చూసినా దీని టాపిక్కే మాట్లాడుకునేలా చేయాలి. పబ్లిసిటీ హోరెత్తిపోవాలి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు మీద పాట, రావిపూడి చేస్తున్న స్పూఫ్ ప్రమోషన్లు త్వరగా ఆడియన్స్ కి రీచ్ అవుతున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ నుంచి సాలిడ్ గా వచ్చింది టీజర్ మాత్రమే. అది కూడా కొంత హడావిడిగా అనిపించిన మాట వాస్తవం.

యుఎస్ బుకింగ్స్ కూడా యమావేగంగా లేవు. ఇంకా చాలా స్క్రీన్లు జోడించాల్సి ఉంది. ప్రీమియం థియేటర్ల కోసం ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి నెంబర్లు పర్వాలేదు కానీ ఆహా ఓహో అనిపించే స్థాయిలో లేవు. ఇంకా చాలా పెరగాలి. 21 విడుదల కాబోతున్న డోప్ సాంగ్ గురించి తమన్ ఓ రేంజ్ లో ఊరిస్తున్నాడు. 28న ట్రైలర్ వస్తుంది. ఈ రెండూ కనక సరిగా డ్యూటీ చేస్తే అంచనాలు పెరగడం ఖాయం. కల్కి 2898 ఏడి, దేవర, పుష్ప 2 ది రూల్ లాగా గేమ్ చేంజర్ కు సోలో రిలీజ్ దక్కడం లేదు. కాబట్టి ఈ రిస్కులన్నీ దృష్టిలో ఉంచుకుని గేమ్ ప్లాన్ మార్చుకోవడం చాలా అవసరం.