సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయి ఈరోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు సినీ, వ్యాపార ప్రముఖులు సంఘీభావం ప్రకటిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫోన్ చేశారు. అల్లు అర్జున్ ఇంటికి విక్టరీ వెంకటేష్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.వాస్తవానికి అల్లు అర్జున్ ఇంటికి స్వయంగా వెళ్లి ప్రభాస్ పరామర్శిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్ లో ప్రభాస్ లేని కారణంగా ఆయన రాలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బన్నీకి ఫోన్ చేసిన ప్రభాస్ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బన్నీకి చెప్పారు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ కు అండగా ఉంటుందని తారక్ చెప్పారు.
మరోవైపు, అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వెళ్లారు. అల్లు అర్జున్ ను స్వయంగా కలిసిన వెంకటేష్ కేసుకు సంబంధించిన వివరాలతో పాటు కేసు పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించారు. వారితోపాటు యంగ్ హీరో అక్కినేని అఖిల్, అడవి శేష్ తదితరులు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.