వెజ్ ప్రచారం మీద సాయిపల్లవి సీరియస్!

సోషల్ మీడియా ప్రపంచంలో ఏదైనా వార్త వైరల్ కావడానికి సెకండ్లు చాలు. ఒక్కోసారి నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండానే చాలా దూరం తీసుకెళ్ళిపోతారు. తాజాగా సాయిపల్లవి విషయంలో అదే జరిగింది. బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణలో రన్బీర్ కపూర్ జోడిగా సీత పాత్రలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయిపల్లవి పూర్తి శాఖాహారిగా మారిపోయిందని, షూటింగ్ అయ్యేంత వరకు నాన్ వెజ్ పదార్థాలు తీసుకోరనే ప్రచారం మొదలయ్యింది. దీన్ని కొన్ని పేరున్న తమిళ ఎక్స్ హ్యాండిల్స్ పబ్లిష్ చేయడంతో అవగహన లేని ప్రేక్షకులు అవునాని ఆశ్చర్యపోయారు.

వాస్తవం ఏమిటంటే సాయిపల్లవి ఎప్పుడూ శాఖాహారినే. ప్రత్యేకంగా రామాయణ కోసం మానేయడం లాంటివి లేవు. కానీ లేని అలవాటుని ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఇప్పుడేదో త్యాగం చేసినట్టు కొన్ని ఛానల్స్ చేసిన అతి పట్ల ఫిదా భామా సీరియస్ అయ్యింది. ఇకపై ఇలాంటివి మానుకోకపోతే తన నుంచి చట్టపరమైన చర్యలు చవిచూడాల్సి వస్తుందని సీరియస్ గా ట్వీట్ చేసింది. తన సినిమాల రిలీజులు, చిత్రీకరణలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పుకార్లు తేవడం మామూలైపోయిందని, ఇకపై మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సాయిపల్లవికి నెటిజెన్ల నుంచి పూర్తి మద్దతు దక్కుతోంది.

వచ్చే ఫిబ్రవరిలో తండేల్ ద్వారా నాగచైతన్యతో కలిసి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న సాయిపల్లవి ఇటీవలే అమరన్ నటనకు అన్ని వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. తను కాకుండా ఈ పాత్ర ఎవరు చేసినా ఇంత స్పందన వచ్చేది కాదన్నా మాట వాస్తవం. రామాయణలో సీత లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ ని ఎంచుకున్న సాయిపల్లవి ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం పెద్ద ఎత్తున డేట్లు కేటాయిస్తోంది. గతంలో శ్రీరామరాజ్యం టైంలో నయనతార సీతగా చేసినప్పుడు ఇలాంటి వెజ్ న్యూసులు వచ్చాయి కానీ ఆమె విషయంలో అవి నిజమే. కానీ సాయిపల్లవికి మాత్రం పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.