ఫిలిం ఇండస్ట్రీలో పనిని దోచుకోవడం అన్నది కామన్ వ్యవహారం. ఎవరో చేసిన పనిని తమదిగా చెప్పుకుని క్రెడిట్ తీసుకోవడానికే చాలామంది ప్రయత్నిస్తారు. చాలామంది స్టార్ రైటర్లు, డైరెక్టర్లు బోలెడంతమంది రచయితలను పెట్టుకుని పని చేస్తారు. కానీ చివరికి రచన క్రెడిట్ మొత్తం వాళ్లే తీసుకుంటారు. వేరే వాళ్లకు క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడరు.
కొన్నిసార్లు సరైన పారితోషకమూ దక్కదు. ఇక ఎక్కడెక్కడి నుంచో కంటెంట్ కాపీ కొట్టి తమ పనితనంగా గొప్పలు పోయే రచయితలు, దర్శకులూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్ల మధ్య సుకుమార్ భిన్నంగా కనిపిస్తారు. ఆయన సినిమాల్లో ఒరిజినాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుకుమార్ సైతం చాలామంది రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టుకుని పని చేస్తారు. కానీ సినిమా చూస్తే ప్రతి సన్నివేశంలోనూ ఆయన ముద్ర కనిపిస్తుంది.
అలా అని మొత్తం క్రెడిట్ తనే తీసుకోవాలని అనుకోరు. రైటింగ్ క్రెడిట్స్‌లో చాలామంది పేర్లు వేస్తారు. సినిమా కోసం పని చేసిన అందరికీ తగిన పారితోషకమూ దక్కేలా చూస్తారు.ఇవన్నీ ఒకెత్తయితే తన సినిమాల సక్సెస్ మీట్లలో ఆయన టీం అందరినీ వేదిక మీదికి పిలిచి కొనియాడే తీరు ప్రత్యేకం. ‘పుష్ప-2’ సక్సెస్ నేపథ్యంలో ఆయన తన రైటింగ్, డైరెక్షన్ టీంలో ఒక్కొక్కరి గురించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.
వీళ్లందరూ కలిస్తేనే సుకుమార్.. వీళ్లు ఒక్కొక్కరు ఒక్కో సుకుమార్.. వాళ్లు లేకుంటే నేను లేను అని చెప్పడం సుకుమార్ గొప్ప మనసుకు నిదర్శనం. అన్నిటికీ మించి శ్రీమన్ అనే కో డైరెక్టర్ గురించి సుకుమార్ చెప్పిన మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. సినిమాలో సెకండ్ యూనిట్ తీసిన సీన్లు 30 శాతం వరకు ఉంటాయని.. అందులో చాలా వరకు శ్రీమన్‌యే డైరెక్ట్ చేశాడని.. తెర మీద పొరపాటున దర్శకుడిగా తన పేరు వచ్చిందని.. నిజానికి డైరెక్టెడ్ బై సుకుమార్, శ్రీమన్ అని వేయాల్సిందని సుకుమార్ చెప్పడం ఇండస్ట్రీని విస్మయానికి గురి చేసింది.
హెక్టిక్ షెడ్యూల్స్ మధ్య షూట్ జరిగినపుడు కొన్ని సీన్లను అసిస్టెంట్లు డైరెక్ట్ చేయడం మామూలే కానీ.. వాళ్లకు ఇలా స్టేజ్ మీద క్రెడిట్ ఇచ్చే దర్శకుడు ఇంకెవరైనా ఉంటారా అంటూ సుకుమార్‌ను సామాజిక మాధ్యమాల్లో అందరూ కొనియాడుతున్నారు.