టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘హ్యాపీ’ లాంటి ఫ్లాప్ సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తే సూపర్ హిట్టయి అతడికి అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. తర్వాత చాలా సినిమాలు అక్కడ మంచి వసూళ్లు సాధించాయి. మాలీవుడ్ స్టార్లతో సమానంగా అక్కడ ఫాలోయింగ్ సంపాదించాడు బన్నీ. అతడి చివరి సినిమా ‘పుష్ప’ కూడా మలయాళంలో చాలా బాగా ఆడింది.
దీంతో ‘పుష్ప-2’ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. బన్నీ కూడా ఈ చిత్రాన్ని అక్కడ బాగా ప్రమోట్ చేశాడు. ‘పీలింగ్స్’ పాటలో మలయాళంలో లిరిక్స్ పెట్టి అక్కడి వాళ్లను మరింత ఇంప్రెస్ చేశాడు. ప్రమోషన్ల టైంలో కేరళలో తన గడ్డ అని చెబుతూ.. తాను ఆ రాష్ట్రానికి దత్త పుత్రుడినని పేర్కొన్నాడు. ఈ సినిమాకు అక్కడున్న హైప్ చూసి డిస్ట్రిబ్యూటర్ కూడా భారీ వసూళ్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
పర భాషా చిత్రాల్లో ‘లియో’ కేరళలో నెలకొల్పిన కలెక్షన్ల రికార్డును ‘పుష్ప-2’తో బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశాడు.కానీ ‘పుష్ప-2’ సినిమా కేరళలో అనుకున్నంతగా ప్రభావం చూపట్లేదు. తొలి రోజు ఈజీగా పది కోట్ల గ్రాస్ మార్కును దాటేస్తుందని అంచనా వేస్తే.. రూ.6 కోట్ల వసూళ్లే వచ్చాయి. రెండో రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి. సినిమాకు మామూలుగా డివైడ్ టాక్ ఉండగా.. కేరళలో ఇంకొంచెం ఎక్కువ నెగెటివ్ టాక్ వచ్చింది.
మలయాళ ప్రేక్షకులు కొంచెం సున్నితంగా ఉంటారు. అక్కడి సినిమాలూ అంతా. వాళ్లకు మరీ ఇంత మాస్ కంటెంట్ ఇచ్చేసరికి సానుకూల స్పందన కనిపించట్లేదు. హిందీ రూరల్ ఆడియన్సుని, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాను ఊర మాస్‌గా తీర్చిదిద్దారు. కానీ మలయాళీలకు ఇది రుచిస్తున్నట్లు కనిపించడం లేదు. ఫాహద్ ఫాజిల్ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు కూడా వాళ్లకు నచ్చుతున్నట్లు లేదు. దీంతో ఓపెనింగ్స్‌లోనే ‘పుష్ప-2’ వెనుకబడింది. ‘లియో’ మలయాళంలో రూ.60 కోట్ల దాకా వసూళ్లు రాబట్టగా.. ‘పుష్ప-2’ అందులో సగం కలెక్ట్ చేయడం కూడా సందేహంగానే ఉంది.