గుడ్ న్యూస్  – పుష్ప 2 టికెట్ రేట్లు తగ్గనున్నాయా?

రెండు రోజులకే రెండు డబుల్ సెంచరీలతో నాలుగు వందల కోట్ల గ్రాస్ దాటేసిన పుష్ప 2 ది రూల్ ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే పలు ప్రాంతాల్లో కొంచెం వెనుకబడటం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల దృష్టికి వచ్చింది. నైజామ్ లాంటి కేంద్రాల్లో బలంగా ఉన్నా ఏపీలోని కొన్ని సెంటర్లలో వీక్ డేస్ వసూళ్లు నెమ్మదించడం వెనుక అధిక టికెట్ ధరలే కారణమనే అభిప్రాయం వ్యక్తం కావడం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి సాధారణ రేట్లు తీసుకొచ్చే ఆలోచనలో మైత్రి టీమ్ ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం, అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.

ఒకవేళ ఇది అమలు చేసిన పక్షంలో కలెక్షన్లలో భారీ జంప్ చూడొచ్చు. ఎందుకంటే ఇంకా థియేటర్లకు వెళ్లని ప్రేక్షకుల సంఖ్య భారీగా ఉంది. ముఖ్యంగా కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లే ఆడియన్స్ టికెట్ రేట్లు మాములు కావడం కోసం ఎదురు చూస్తున్నారు. అలా జరిగితే ఏపీలో 177 నుంచి 200 లేదా 225 రూపాయల లోపే మల్టీప్లెక్స్ టికెట్ రావొచ్చు. తెలంగాణలో గరిష్టంగా ఉన్న 295 తీసుకొస్తే టికెట్ల అమ్మకాలు భారీగా ఉండబోతాయి. సింగల్ స్క్రీన్లు బాల్కనీ 200 రూపాయలు చేయడం వల్ల వీక్ డేస్ లోనూ మంచి ఆక్యుపెన్సీలు చూడొచ్చు. ఇదే ప్రేక్షకులు జరగాలని కోరుకుంటున్నది.

వెయ్యి కోట్ల మార్కు మీద కన్నేసిన పుష్ప 2 ది రూల్ ఆ ఫీట్ ని సాధించేందుకు ఎక్కువ టైం తీసుకునేలా లేదు. శని ఆదివారాలు కీలకం కాబోతున్నాయి. డిసెంబర్ 20 దాకా చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేకపోవడం అటు నార్త్ ఇటు సౌత్ రెండుచోట్లా భారీ ప్రయోజనం చేకూరుస్తుంది. నాన్ బాహుబలి, నాన్ రాజమౌళి రికార్డులు నాన్ పుష్ప 2గా మారటానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా హిందీ నెంబర్లు షాకింగ్ గా ఉంటున్నాయి. కేరళలో విరుచుకుపడుతుందనుకుంటే అనూహ్యంగా నార్త్ లో పుష్ప 2 దుమ్మురేపడం ఈ బ్రాండ్ పెంచుకున్న మార్కెట్ కి నిదర్శనం. కనీసం రెండు వారాలు ఈ జోరు తగ్గేలా లేదు.