యానిమల్ లో తండ్రి మీద ప్రేమ కొడుకుని ఎంత వయొలెంట్ గా మారుస్తుందో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించిన తీరు ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. నాన్న మీద హత్యాప్రయత్నం చేస్తే దానికి మారణకాండ సృష్టించి ఏకంగా అక్క భర్తని పట్టపగలు చంపే ఎపిసోడ్ ఎన్ని దశాబ్దాలు దాటినా అలా గుర్తుండిపోతుంది. హింస, అడల్టరి లాంటి అంశాలను పక్కనపెడితే సందీప్ వంగాలోని అగ్రెసివ్ యాంగిల్ అర్జున్ రెడ్డిని మించి బయట పడింది యానిమల్ తోనే. అందుకే ప్రభాస్ స్పిరిట్ ఇంకా మొదలుకాకుండానే అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఇలాంటి వాడు అమ్మప్రేమను కథగా రాసుకుంటే ఎలా ఉంటుంది.
ఈ ఆలోచన ఇండియన్ ఐడల్ 15 రియాలిటీ షో నిర్వాహకులకు వచ్చింది. యానిమల్ మొదటి యానివర్సరీ సందర్భంగా ముఖ్య అతిధిగా వచ్చిన సందీప్ వంగాని నేరుగా ఇదే ప్రశ్న అడిగేశారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా తన సినిమాల్లో తల్లి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వనని అందరూ అనుకుంటారని, కానీ నిజ జీవితంలో అర్జున్ రెడ్డి మీద పెట్టుబడికి ఎవరూ ముందు రాకపోతే అమ్మ సహాయం చేయడం వల్లే స్వంతంగా నిర్మించామని చెప్పాడు. ఆవిడతో ఉన్న అనుబంధంలో ఎలాంటి లోపాలు, ఫిర్యాదులు లేకపోవడమే తనకు సంతోషమని పేర్కొన్నాడు.
ఒకవేళ మదర్ సెంటిమెంట్ తో సినిమా తీస్తే మాత్రం అందులో ఎలాంటి డార్క్ షేడ్స్ ఉండవని, పూర్తిగా పాజిటివ్ వైబ్స్ తీస్తానని చెప్పడం గమనార్షం. అంటే ఒక కంప్లీట్ క్లీన్ మూవీ కావాలంటే సందీప్ కథలో తల్లి క్యారెక్టర్ ఉండాలన్న మాట. ప్రస్తుతానికి తన దగ్గర అలాంటి లైన్ ఏదీ ఉన్నట్టు లేదు. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సందీప్ వంగా ప్రభాస్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదయ్యాక యానిమల్ పార్క్ పట్టాలు ఎక్కించాలి. చాలా నెలల క్రితం ప్రకటించిన అల్లు అర్జున్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చూసుకోవాలి. చిరంజీవితో సినిమా గురించి టాక్ వచ్చింది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.