బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ ఏకంగా ఆర్ఆర్ఆర్ రెకార్డులకే ఎసరుపెట్టే దిశగా దూసుకుపోతున్న పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఎంత మాత్రం తక్కువగా చూడలేని పరిస్థితి. ఉన్నవి నాలుగు పాటలే అయినా మాస్ కి ఎక్కేలా కంపోజ్ చేయడంలో మరోసారి విజయం సాధించడం పుష్ప 2 ఆల్బమ్ ని ఛార్ట్ బస్టర్ చేసింది. నేపధ్య సంగీతం విషయంలో ఎవరికి ఎంత క్రెడిట్ అనేది పక్కన పెడితే ఒరిజినల్ స్కోర్ క్యాటగిరీ కింద దేవి పేరే ఉండటం ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. సామ్ సిఎస్ అదనపు విభాగంలో ఉన్నారు. తాజాగా దేవి పంచుకున్న కొన్ని ముచ్చట్లు పుష్ప 2 తెరవెనుక కథలను విప్పాయి.
కిసిక్ పాట అనుకున్నప్పుడు ముందు చేతిలో ఎలాంటి ట్యూన్ లేదు. స్టోరీ ప్రకారం కేవలం కిసిక్ అనే పదం మాత్రమే దర్శకుడు సుకుమార్ దేవికి చెప్పారు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, స్నేహితులను కలుసుకున్నప్పుడు ఫోటోలు దిగడం సహజమే కాబట్టి అప్పుడు కెమెరా నుంచి వచ్చే కిసిక్ శబ్దాన్ని రిథమ్ గా మార్చి చంద్రబోస్ సహాయంతో సిద్ధం చేసేశారు. మంచి మాస్ సాంగ్ ఒకటి పడాలన్నా ఉద్దేశంతో పీలింగ్స్ ని కంపోజ్ చేసిన తీరు, దానికి ముందు మలయాళం లిరిక్స్ ని పొందుపరిచి దానికో మెలోడీ టచ్ ఇచ్చిన విధానం అన్నీ చెప్పుకొచ్చారు. ఇక కాపీ పాటల ప్రస్తావన కూడా వచ్చింది.
కాపీ కొట్టేసి స్ఫూర్తి చెందానని చెప్పుకోవడానికి తాను పూర్తి విరుద్ధమని, ఎవరైనా ఇంగ్లీష్ లేదా ఇతర బాషల సిడిలు ఇచ్చి పాటలు చేయమంటే దానికి ఒప్పుకునేవాడిని కాదని స్వంతంగా తయారు చేయడమే తన సిద్ధాంతమని కుండబద్దలు కొట్టాడు. అవకాశం రాబట్టుకోవడాన్ని ఒప్పుకుంకుంటానేమో కానీ వేరొకరి అవకాశాన్ని తీసుకోవడం మాత్రం తప్పని చెబుతున్న డిఎస్పి ఎవరి గురించి అన్నాడో పేర్లు చెప్పలేదు కానీ క్రెడిట్ వ్యవహారం గురించి క్లూ ఇచ్చినట్టే ఇచ్చి వదిలేశాడు. ఇదంతా ఎలా ఉన్నా దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ లో పుష్ప 2 ది రూల్ రూపంలో మరో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయితే చేరిపోయింది.