పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరొకరికి ఇవ్వడం గురించి దేవిశ్రీ ప్రసాద్ చెన్నై ఈవెంట్ లో బహిరంగంగానే నిర్మాతలను ఉద్దేశించి ప్రసంగించడం చాలా హాట్ టాపిక్కయ్యింది. తర్వాత అదేమీ లేదని నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇవ్వడం, హైదరాబాద్ వేడుకలో దేవి ఇదంతా మర్చిపోయి మళ్ళీ మాములుగా ఉండటం అభిమానులను హమ్మయ్య అనుకునేలా చేసింది. సామ్ సిఎస్ నేపధ్య సంగీతంలో భాగమైనప్పటికీ టైటిల్ కార్డులో ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ కి డిఎస్పి పేరే ఉంచి అడిషనల్ క్యాటగిరీలో సామ్ ని చేర్చారు. సో పుష్ప 2 మెయిన్ క్రెడిట్ స్పష్టంగా దేవి అకౌంట్లోకి వచ్చేసింది. అంతా శుభమే అనుకోవాలి.
అసలు పాయింట్ ఏంటంటే మైత్రి, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో వేర్వేరు దర్శకులతో ఇప్పటిదాకా ఎనిమిది సినిమాలు వస్తే అవన్నీ బ్లాక్ బస్టర్లు,సూపర్ హిట్లు అయ్యాయి. ఒక్కటి కూడా యావరేజ్ లేదా ఫ్లాప్ కాలేదు. మొదటిసారి ‘శ్రీమంతుడు’తో చేతులు కలిపితే అది మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ మరో సంచలనం నమోదు చేసింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడితే ‘చిత్రలహరి’ పాటలను యూత్ బాగా ఆదరించారు. ‘ఉప్పెన’ విషయంలో దేవి సాంగ్స్ పోషించిన పాత్ర గురించి తక్కువ మాటల్లో చెప్పలేం.
ఇక ‘పుష్ప 1 ది రైజ్’ ఏకంగా బన్నీ, దేవి ఇద్దరికీ నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తావన వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ ఆనందం మాములుగా ఉండదు. పాటలు, బీజీఎమ్ రెండూ బెస్ట్ అనిపించుకున్నాయి. తాజాగా ‘పుష్ప 2 ది రూల్’ సైతం ఇదే క్యాటగిరీలోకి వెళ్తోంది. మొదటి భాగాన్ని మించి విజయం సాధించడం ఖాయమని ఓపెనింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. మాస్ పాటలు ఊపేస్తున్నాయి. ఈ కలయికలో నెక్స్ట్ అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో పాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉన్నాయి. ఇవి కూడా హిట్టు కొడితే దశకంఠాభరణాలుగా మైత్రి దేవి కాంబో చాలా స్పెషల్ గా నిలిచిపోతుంది.