పుష్ప టికెట్ రేట్లు…అస్సలు తగ్గేదేలే

ప్రస్తుతం దేశమంతా పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుంది. రేపు రాత్రి 9.30 గంటల స్పెషల్ షోతో పుష్పగాడి రూల్ మొదలు కాబోతోంది. భారీ అంచనాలతో విడుదలకు ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆ రేంజ్ లోనే హైప్ ఏర్పడింది. బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలోనే పుష్ప టీంకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది.

అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. సినిమా విడుదలను చివరి నిమిషంలో ఆపలేమని తేల్చి చెప్పింది. దీంతో, పుష్ప టికెట్లు రేట్లు యథాతధంగా పెంచి అమ్ముకునే అవకాశం కలిగింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. దీంతో, టికెట్ రేట్ల విషయంలో అయినా సరే అస్సలు తగ్గేదేలే అని పుష్పగాడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని, ఆ డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో తెలియాలని, సినిమా విడుదల ఆపాలని పిటిషనర్ సతీష్‌ కోరారు. దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్‌ ఇచ్చింది. అయితే, బెనిఫిట్‌ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను 2 వారాల్లోపు తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది. టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పరిశీలిస్తామని తెలిపింది.