రివ్యూలపై కేసు : కోర్టు ఏమందంటే…

సినిమా రివ్యూల విషయంలో తమిళ సినీ పరిశ్రమ ఈ మధ్య చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వేట్టయాన్, కంగువ లాంటి సినిమాలు ప్రతికూల ఫలితాన్ని అందుకోవడానికి రివ్యూలే కారణమని అక్కడి నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే థియేటర్ల దగ్గర రివ్యూలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా టాక్ తెలుసుకునే హక్కు ప్రేక్షకులకు ఉందని.. రివ్యూలను ఆపాలనుకోవడం సమంజసం కాదని కొందరంటే.. షో పడీ పడగానే ఇన్‌స్టంట్ రివ్యూలు ఇచ్చి సినిమాను చంపేస్తున్నారని, బాగున్న సినిమాల గురించి కూడా ఎక్కువ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. రివ్యూలకు ఇలా బ్రేక్ వేయడం సరైన నిర్ణయమే అని మరి కొందరన్నారు. ఐతే తమిళ నిర్మాతల మండలి ఇంతటితో ఆగకుండా ఇప్పుడు రివ్యూలను ఆపే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది.

సినిమా రిలీజైన తొలి మూడు రోజులు ఇవ్వరూ రివ్యూలు ఇవ్వకుండా ఆపాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మద్రాస్ హైకోర్టులో తమిళ నిర్మాతల మండలి పిటిషన్ వేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలోనూ రివ్యూలు రాకుండా నిషేధం విధించాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఐతే సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సముద్రం. ఇక్కడ సినిమా టాక్, రివ్యూలు రాకుండా ఆపడం అన్నది అంత తేలికైన విషయం కాదు. సినిమా ఎలా ఉందో తెలుసుకుని థియేటర్లకు వెళ్లే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది కాబట్టి రివ్యూలు రాకుండా ఆపడం అన్నది సమంజసంగా అనిపించకపోవచ్చు. కాబట్టి కోర్టు ఈ విషయంలో నిర్మాతల ఆలోచనలను అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని కోలీవుడ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.